
కారుచౌక మోసం
జీపీఎస్ ట్రాకర్లను అమర్చి..
కేసు వివరాలు తెలుపుతున్న ఎస్పీ రాజేశ్‌చంద్ర, పోలీసులు
జిల్లా కేంద్రానికి చెందిన ఉప్పల్వాయి ప్రశాంత్ గౌడ్ ఫేస్‌బుక్ అప్లికేషన్‌లో చూసి సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేశాడు. ఆ మరుసటి రోజు ఓ వ్యక్తి వచ్చి అది తన కారని చెప్పి తీసుకుపోయాడు. కారు విక్రయించిన వ్యక్తులకు ఫోన్ చేయగా.. అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన గతనెల 7వ తేదీన మాచారెడ్డి పీఎస్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపగా కొత్త రకం మోసం వెలుగు చూసింది. కొందరు ముఠాగా ఏర్పడి సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. నిందితుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలించారు.
ముఠాగా ఏర్పడి..
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపీనగర్‌కు చెందిన మహమ్మద్ ఇయాజ్, వికారాబాద్‌లోని ఆలంపల్లికి చెందిన మహమ్మద్ జాహీద్ అలీ, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురానికి చెందిన పృధ్వి జగదీష్, రాచర్ల శివకృష్ణ, వేములవాడకు చెందిన వివేక్, శేరిలింగంపల్లి మండలానికి చెందిన కర్ణకోట సాకేత్, అలీ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు ముందుగా ట్రావెల్స్ సంస్థల నుంచి వ్యక్తిగతంగా ఇచ్చే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అద్దెకు తీసుకుంటారు. వాటి నంబర్ ప్లేట్‌లు మార్చేసి నకిలీ ఆర్‌సీ, ఇతర పత్రాలు సృష్టిస్తారు. అనుమానం రాకుండా నకిలీ ఆర్‌సీ తయారు చేయడానికి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో ఖాళీ మైక్రో సిమ్ కార్డులు, ఖాళీ చిప్ కార్డులను కొంటారు. వాటిపై పేర్లు, వివరాలను ప్రింటింగ్ చేస్తారు. అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి ఇతర పత్రాలన్నీ తయారు చేస్తారు. ఆపై ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో కారు అమ్మకానికి ఉందని పెట్టి, తక్కువ ధరకే వాటిని అమ్మనున్నట్లు పేర్కొంటారు. కారు, చౌక ధరను చూసి ఆకర్షితులైనవారు వారి వలలో చిక్కుతున్నారు.
కారును అమ్మేటప్పుడు దాంట్లో జీపీఎస్ ట్రాకర్‌ను అమరుస్తారు. దీంతో కారు ఎక్కడుందో వారికి తెలిసిపోతుంది. కారున్న చోటుకు వెళ్లి రాత్రికి రాత్రి వారు విక్రయించిన కారునే చోరీ చేసి తీసుకువచ్చి అసలు యజమానికి అప్పగిస్తున్నారు. అలా వీలు కాని సందర్భాల్లో ఇతరులను పంపి కారు మాది అంటూ బెదిరింపులకు పాల్పడి ఎత్తుకొస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని కారు అమ్మిన తర్వాత రెండు నుంచి మూడు రోజుల వ్యవధిలో పూర్తి చేస్తున్నారు.
అద్దెకు తెచ్చి.. ఫేక్ ఆర్సీ,
నంబర్ ప్లేట్ తయారు చేసి..
ఫేస్‌బుక్ ద్వారా తక్కువ ధరకు విక్రయం
ఆపై అదే కారును చోరీ చేసి..
యజమానికి అప్పగిస్తున్న వైనం
ముఠా గుట్టురట్టు చేసిన
మాచారెడ్డి పోలీసులు
ఆరుగురు నిందితుల అరెస్ట్,
పరారీలో మరొకరు
వివరాలు తెలిపిన ఎస్పీ రాజేశ్ చంద్ర