
చెక్‌డ్యాం పైనుంచి వెళ్లొద్దు
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● తాడ్వాయి మండలంలో పర్యటన
తాడ్వాయి: వాటర్ ఓవర్‌ఫ్లో తగ్గేంతవరకు ప్రజలు చెక్‌డ్యాంలపైనుంచి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. ఆయన బుధవారం తాడ్వాయి మండల కేంద్రంతోపాటు సంతాయిపేట్, చిట్యాల గ్రామాలలో పర్యటించారు. సంతాయిపేట్ శివారులోని శ్రీభీమేశ్వరాలయం వద్ద పారుతున్న భీమేశ్వర వాగును పరిశీలించారు. అధికంగా నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు చెక్‌డ్యాంపైకి ఎవరిని వెళ్లనీయొద్దన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. చిట్యాల పాఠశాలలో సీడ్ బాల్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విత్తన బంతుల విస్తరణ కార్యకరమాన్ని నిర్వహించారు. గ్రామాలలో కోతుల బెడద పోవాలంటే పండ్ల మొక్కలను పెంచాలన్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం తాడ్వాయిలో డ్రోన్ ద్వారా మందులు, ఎరువులను ఎలా పిచికారి చేయాలో రైతులకు అవగాహన కల్పించారు. నానో యూరియా ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ మల్లేష్, డీఈవో రాజు, మండల ప్రత్యేకాధికారి శివకుమార్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీవో సయ్యద్ సాజిద్ అలీ, ఎంపీవో సవితారెడ్డి, ఏపీవో కృష్ణాగౌడ్ పాల్గొన్నారు.