
నేరాల్లోనూ జతగా..
వారించాల్సిందిపోయి...
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : భార్యాభర్తల బంధమంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. కొందరు నేరాల్లోనూ జతగా నిలుస్తున్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలన్న దుర్బుద్ధితో భర్తకు తోడుగా భార్య నేరంలో భాగస్వామిగా మారుతుండడం విస్మయం కలిగిస్తోంది.
కామారెడ్డి పట్టణంలో ఈనెల 17 న సాయంత్రం సొంతూరుకు బైకుపై వెళ్తున్న వ్యక్తిని ఓ మహిళ లిఫ్ట్ అడిగింది. వారు బైక్‌పై కొద్దిదూరం వెళ్లిన తర్వాత మరో బైకుపై వచ్చిన సదరు మహిళ భర్త వీరిని ఆపాడు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరు కలిసి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిపై దాడి చేసి అతడి వద్దనున్న రూ.2 వేలు, సెల్‌ఫోన్ లాక్కుని పారిపోయారు. ఈ ఘటనలో పోలీసులు భార్యభర్తలను అరెస్టు చేశారు. గతంలో భిక్కనూరు మండలంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన కేసులో మాచారెడ్డి మండలానికి చెందిన భార్యాభర్తలను పోలీసులు కటకటాల వెనక్కి పంపిన విషయం తెలిసిందే. కామారెడ్డిలో మోసానికి పాల్పడిన ఘటనలో ఓ జంట అరెస్టయ్యింది. భార్యాభర్తలిద్దరూ అరెస్టయి జైలుపాలవడంతో వారి పిల్లలు అనాథలు అవుతున్నారు. ఇదే సమయంలో నేరాలకు పాల్పడి చిక్కిన వారిపై ఎప్పటికీ ఆ ముద్ర అలాగే ఉండిపోతుంది. అలాంటి నేరాలు మళ్లీ ఎక్కడ జరిగినా పోలీసులు వారినే అనుమానించే పరిస్థితి ఎదురవుతుంది.
తప్పించుకోలేరు...
నేరం చేసిన వారు తప్పించుకునే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. అడుగడుగునా సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ నెట్‌వర్క్ నేరస్తులను పట్టిస్తున్నాయి. వేలిముద్రల ఆధారంగా నేరస్తులు ఎవరో తెలిసిపోతోంది. ఏదో ఒక సాంకేతిక ఆధారాన్ని సాక్ష్యంగా చూపి నేరస్తులను అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు. నేరం చేసి దూరానికి పారిపోయినా సరే దొరికిపోతున్నారు.
భార్యాభర్తల్లో ఎవరో ఒకరు తప్పుదారిలో వెళ్తే వారించి సరైన మార్గంలో పెట్టాల్సిన వారే తప్పుడు పనులకు, అది కూడా నేరాలకు తోడుగా నిలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో పలు సంఘటనల్లో భా ర్య, భర్తలు భాగమవుతున్న కేసులు వెలుగు చూస్తున్నాయి. కొన్నిచోట్ల కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య భూములు, ఆస్తుల గొడవల్లో జరిగే దాడులు, హత్యల్లోనూ భార్యభర్తలు భాగమై కేసుల్లో జైలుకు వెళుతున్నారు. రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం గ్రామంలో అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి వివాదంలో జరిగిన హత్య కేసులో భార్యభర్తలు అరెస్టయ్యారు. మరికొన్ని కేసుల్లోనూ భార్యభర్తలు అరెస్టయిన ఉదంతాలున్నాయి. పిల్లల కిడ్నాప్ సంఘటనల్లోనూ గతంలో ఓ జంట అరెస్టయ్యింది. ఈజీ మనీ కోసం ఇలా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
సులువుగా డబ్బులు
సంపాదించడం కోసం అడ్డదారులు
పోలీసులకు చిక్కి కటకటాలపాలు
తాజాగా దారిదోపిడీ కేసులో
మరో జంట అరెస్టు