
ప్రాజెక్టుకు జన కళ
● నిజాంసాగర్‌నుంచి
కొనసాగుతున్న నీటి విడుదల
● భారీగా తరలివచ్చిన పర్యాటకులు
నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీరు, తిలకిస్తున్న పర్యాటకులు
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు జనసంద్రంగా మారింది. ప్రాజెక్టు అందాలను తిలకించడానికి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. దీంతో ప్రాజెక్టు పరిసరాలు కిక్కిరిసిపోయాయి. బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 65,269 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఎగువ ఉన్న సింగూరు ప్రాజెక్టు 5 గేట్ల ద్వారా 43 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా హల్దీవాగు, పోచారం ప్రాజెక్టు అలుగుల ద్వారా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 16 గేట్ల ద్వారా 1,00,600 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1,403.25 అడుగుల (15.323 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
కౌలాస్‌నాలాకు 2,724 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కౌలాస్ నాలా ప్రాజెక్టులోకి 2,724 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు ఏఈ రవిశంకర్ తెలిపారు. దీంతో ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 2,624 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు (1.237 టీఎంసీ) కాగా.. ప్రస్తుతం 457.65 మీటర్ల (1.152 టీఎంసీ) నీరు నిల్వ ఉందన్నారు.

ప్రాజెక్టుకు జన కళ