
దంచికొట్టిన వాన
జల దిగ్బంధంలో లింబూర్‌వాడి
అలుగు పారుతున్న పోచారం ప్రాజెక్టు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తుపాను ప్రభావంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగు పోస్తోంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద వస్తోంది. జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు నిండి అలుగు పారుతోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. కొన్ని చోట్ల వర్షంతో పాత ఇళ్లు కూలిపోయాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు జిల్లాలో అత్యధికంగా రామారెడ్డిలో 123.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. బీబీపేట, భిక్కనూరు, దోమకొండ, మాచారెడ్డి, పాల్వంచ తదితర మండలాలు మినహా జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
లింగంపేట మండలంలో పెద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పోల్కంపేట, భవానీపేట, నాగా రం కాసుకత్త వాగులు పారుతున్నాయి. తాడ్వాయి మండలంలోని భీమేశ్వర వాగు, ఎర్రాపహడ్, కరడ్‌పల్లి, కాళీజీవాడి, కన్కల్, చందాపూర్, సోమారం ప్రాంతాల్లోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిపివేశారు. గాంధారి మండంలోని దుర్గం– గుజ్జుల్, గుర్జాల్– వండ్రికల్, గాంధారి–తిప్పారం మధ్య వాగులు ఉ ధృతంగా పారుతున్నాయి. మద్నూర్ మండలంలో ని అంతాపూర్ సమీపంలో లోలెవల్ వంతెనపై నుంచి భారీగా వరద నీరు ప్రవహించడంతో మ ద్నూర్–జుక్కల్ మధ్య రాకపోకలు నిలిచిపోయా యి. చిన్న ఎక్లారలోంచి వాగు ప్రవహించింది. గ్రా మంలోని హనుమాన్ ఆలయం, వాటర్ ట్యాంక్ చు ట్టూ ఉన్న ఇళ్లలో వరదనీరు చేరడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. మాచారెడ్డి మండలంలో పా ల్వంచ వాగు ఉధృతంగా పారుతోంది. ఎల్పుగొండ తండాకు వెళ్లే రోడ్డు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం కలిగింది. రామారెడ్డి మండలంలోని కన్నాపూర్‌లో వాగు పొంగి ప్రవహిస్తోంది. ఎల్లారెడ్డి ఎ మ్మెల్యే మదన్‌మోహన్‌రావు వాగును పరిశీలించారు.
మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన రావుల సిద్ధిరాములు, కిషన్‌రావు, రాజు, మల్లీశ్వరిలకు చెందిన ఇళ్లు శనివారం కూలిపోయాయి. ఆ సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రాజంపేట మండలం ఆరెపల్లి తండాకు చెందిన లంబాడి శంకర్ ఇల్లు పాక్షికంగా కూలిపోయింది. గాంధారి మండలం జువ్వాడిలో చాకలి సంగవ్వకు చెందిన ఇల్లు కూలింది. ఆ ఇంట్లో ఎవరూ నివసించకపోవడంతో ప్రమాదం తప్పింది. చెన్పాపూర్‌లో సూర లలిత, సంపంగి మల్లేష్‌లకు చెందిన ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు గాంధారి తహసీల్దార్ రేణుకా చౌహాన్ తెలిపారు.
భారీ వర్షాల కారణంగా మద్నూర్, డోంగ్లీ మండలాల్లోని పంటలకు నష్టం వాటిల్లింది. సోయాబీన్, చెరుకు, పత్తి పంటలు నీట మునిగాయి. చిన్న ఎక్లార, లచ్చన్, కొడిచిర, ధన్నూర్ శివారులోని పంటలు నీట మునిగాయని రైతులు తెలిపారు.
చిన్న ఎక్లార గ్రామాన్ని
పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్ కిరణ్మయి
జిల్లాలోని వివిధ ప్రాంతాలలో నమోదైన వర్షపాతం..(మి.మీ.)
లొకేషన్ వర్షపాతం
రామారెడ్డి 123.3
సోమూర్ 89.8
రాంలక్ష్మణ్‌పల్లి 87.3
మక్దుంపూర్ 71.5
గాంధారి 69.8
తాడ్వాయి 62.3
సదాశివనగర్ 60.5
కలెక్టరేట్ 58.8
సర్వాపూర్ 54.8
లింగంపేట 50.5
బొమ్మన్‌దేవ్‌పల్లి 43.0
అర్గొండ 42.5
హసన్‌పల్లి 38.0
నస్రుల్లాబాద్ 36.0
జుక్కల్ 35.3
కొల్లూర్ 34.0
పాతరాజంపేట 32.8
ఇసాయిపేట 32.5
పెద్దకొడప్‌గల్ 31.5
మాచాపూర్ 28.3
బీర్కూర్ 28.3
లచ్చాపేట్ 25.8
నాగిరెడ్డిపేట 21.8
మేనూర్ 21.3
బిచ్కుంద 20.0
వరద ప్రాంతాల పరిశీలన
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి లింబూర్‌వాడి వాగు వద్దకు పంచాయతీ ట్రాక్టర్‌లో వెళ్లారు. వాగుకు అవతలి వైపు ఉన్న గ్రామస్తులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఎవరూ వాగుదాటి రావద్దని సూచించారు. అనంతరం మద్నూర్ మండలంలోని అంతాపూర్ వద్ద మద్నూర్–జుక్కల్ రహదారిపై గల వంతెనను పరిశీలించారు. వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచించారు. చిన్న ఎక్లార గ్రామానికి వెళ్లి పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా గ్రామం గుండా వెళ్తున్న వాగు పొంగిపొర్లడంతో వరద నీటిలో విరిగిన చెట్ల కొమ్మలు కొట్టుకుని వచ్చి పైప్‌లైన్‌లో తట్టుకున్నాయని, దీంతో నీరు గ్రామంలోకి చేరిందని పేర్కొన్నారు. వెంటనే పొక్లెయిన్ సహాయంతో వాటిని తొలగించారు. ఆమె వెంట తహసీల్దార్ ముజీబ్, బిచ్కుంద సీఐ రవికుమార్, ఎస్సై విజయ్‌కొండ తదితరులున్నారు.
పొంగి ప్రవహిస్తున్న వాగులు
అలుగెల్లిన పోచారం ప్రాజెక్టు
నిజాంసాగర్‌కు పెరిగిన వరద
చెరువులు, కుంటల్లోకి చేరిన నీరు
మద్నూర్ : డోంగ్లీ మండలంలోని లింబూర్ వాడి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షాలు కురవడంతో లింబూర్, లింబూర్ వాడి మధ్యలోనున్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన నిర్మించాలని ఏళ్లుగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

దంచికొట్టిన వాన

దంచికొట్టిన వాన