
వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు
● మందులు అందుబాటులో ఉన్నాయి
● ఆరోగ్యశ్రీ నిధుల దుర్వినియోగంపై
విచారణ కొనసాగుతోంది
● డీఎంఈ నరేంద్రకుమార్
కామారెడ్డి టౌన్ : జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నరేంద్ర కుమార్ తెలిపారు. శనివారం ఆయన తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కమిషనర్ అజయ్‌కుమార్‌తో కలిసి జీజీహెచ్‌ను సందర్శించారు. బ్లడ్ బ్యాంక్, ల్యాబ్, ఐసీయూ, ట్రామా, ఎక్స్‌రే, డయాలసిస్, ఓపీ, ఫార్మసీ విభాగాలను పరిశీలించారు. డెంగీకి సంబంధించి రక్తపరీక్షలు, ప్లేట్‌లెట్స్ వైద్య సేవలపై ఆరా తీశారు. రక్తఫలికలను వేరు చేసే ఎస్‌డీపీ యంత్రం సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్‌ఎంవో సంతోష్‌కు సూచించారు. ఇన్నేళ్లుగా యంత్రాన్ని వినియోగించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం సూపరింటెండెంట్ చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. మలేరియా, డెంగీ, డయేరియా, చికున్‌గున్యా, విషజ్వరాలు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జీజీహెచ్‌లో సీజనల్ వ్యాధులకు సంబంధించి వైద్య సేవలు అందించేందుకు సరిపడా బెడ్స్, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎమర్జెన్సీ సేవల కోసం పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ వైద్యులు అందుబాటులో ఉన్నారన్నారు. జిల్లాలో గతనెలలో 81 డెంగీ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. కేసులు నమోదవుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జీజీహెచ్‌లో ఆరోగ్యశ్రీ నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగుతోందన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్, సూపరింటెండెంట్‌లు విచారణ చేస్తున్నారన్నారు.
జీజీహెచ్‌లో సిటి, ఎంఆర్‌ఐ సేవలను త్వరలోనే ప్రారంభిస్తామని డీఎంఈ తెలిపారు. ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్దనున్న దేవి ప్రైవేట్ ఆస్పత్రిని సందర్శించారు. సీజనల్ వ్యాధుల బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, వైద్యులు శరత్ తదితరులు పాల్గొన్నారు.
వర్షాలతో ఆస్పత్రి భవనం పైకప్పునుంచి నీరు లీకవుతోంది. దీంతో నీరు కింద పడకుండా చూసేందుకు సిబ్బంది నీరు ఊరుస్తున్న ప్రాంతాలలో డబ్బాలు, చెత్తబుట్టలను ఉంచారు. డీఎంఈ వాటిని చూస్తూ ముందుకు వెళ్లారు. ఎమర్జెన్సీ, మెటర్నిటీ వార్డులలోనూ ఇదే పరిస్థితి ఉంది. వంటశాలలో భవనం పైకప్పు పెచ్చులూడుతున్నాయి.

వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు