
హైవేపై పల్టీలు కొట్టిన కారు
ఇందల్వాయి: మండలంలోని గన్నారం గ్రామ శివారులోగల జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. టోల్‌ప్లాజా సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన షేక్ హమీద్, షేక్ నదీప్, షేక్ అలీ ముగ్గురు కలిసి మంగళవారం ఉదయం శంషాబాద్ ఏయిర్‌పోర్టు నుంచి నిజామాబాద్‌కు బయలుదేరారు. గన్నారం గ్రామ శివారులోగల జాతీయ రహదారిపై వారి కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి పల్టీలు కొట్టి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. వెంటనే స్థానికులు గమనించి కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని సురక్షితంగా బయటకు తీశారు.
చోరీ కేసులో ఒకరికి
ఏడాది జైలు శిక్ష
బాల్కొండ: మండల కేంద్రంలోని ఓ వైన్స్ దుకాణంలో చోరీకి పాల్పడిని వ్యక్తికి ఆర్మూర్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ తెలిపారు. వివరాలు ఇలా.. బాల్కొండలోని తుల్జా భవాని వైన్స్ షాపులో 2024 సెప్టెంబర్ 4న నిర్మల్ మండలం కొండపూర్ గ్రామానికి చెందిన నక్క పోశెట్టి చోరీకి పాల్పడ్డాడు. షట్టర్ తాళం పగలగొట్టి రూ. 14వేల నగదుతోపాటు కొన్ని మందు బాటిళ్లను ఎత్తుకెళ్లాడు. ఈఘటనపై అప్పటి ఎస్సై నరేష్ కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకొని, ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చారు. జడ్జి సరళరాణి సాక్ష్యాధారాలను పరిశీలించి, మంగళవారం అతడికి ఏడాది జైలుశిక్షతోపాటు రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఆయన తెలిపారు.
అట్రాసిటీ కేసులో ఒకరికి..
నిజామాబాద్ లీగల్: కులం పేరుతో దూషించి, దాడి చేసిన కేసులో ఒకరి కి నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. వివరాలు ఇలా.. నగరంలోని మిర్చి కాంపౌండ్ చెందిన దుర్గయ్యను, తన కొడుకును క్రాంతి కుమార్ అనే వ్యక్తి 24 డిసెంబర్ 2020న కులం పేరుతో దూషించి దాడి చేశాడు. బాధితులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుని కోర్టులో హాజరుపర్చారు. విచారణ చేపట్టిన జడ్జి నిందితుడికి ఏడాది జైలు శిక్షతోపాటు రూ.2,400 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.