రెక్కల కష్టం మట్టిపాలు
76,984 ఎకరాలలో నష్టం..
విధ్వంసం సృష్టించిన వరద
సాగుమడిలో ఇసుకమేటలు
కొట్టుకుపోయిన పంటలు..
కన్నీటి పర్యంతమవుతున్న రైతులు
ఆదుకోవాలని వేడుకోలు
వరద నీటికి మట్టికట్ట కొట్టుకుపోవడంతో ఖాళీ అయిన కల్యాణి ప్రాజెక్టు
లింబూర్ శివారులో కుళ్లిపోయిన సోయా పంట
తిమ్మారెడ్డి శివారులోని పొలంలో ఇసుక మేటలు
బీబీపేటలో పొలంలోకి కొట్టుకువచ్చిన బ్రిడ్జికి సంబంధించిన రాళ్లు, ఇసుక
తిమ్మారెడ్డి శివారులో రాళ్ల తెట్టెగా మారిన పొలం
జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. పోటెత్తిన వరదలు సాగుమడులను ఇసుక దిబ్బలుగా మార్చాయి. వారం క్రితం వరకు కళకళలాడిన పంటలు.. ఇప్పుడు కళావిహీనంగా తయారయ్యాయి. దీంతో అన్నదాత కంట కన్నీరు వరదై పారుతోంది.
జిల్లాలో 5,34,569 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అంతా బాగుందని అనుకున్న సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడిన వర్షం రైతులను ఆగం జేసింది. రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాలతో వాగులు పొంగి ప్రవహించాయి. మంజీర పరవళ్లు తొక్కింది. నిజాంసాగర్, పోచారం, కౌలాస్ ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలన్నీ పొంగిపొర్లాయి. దీంతో చాలాచోట్ల పంట పొలాల్లో నీరు నిలిచిపోయి దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల ఇసుక మేటలు వేశాయి. చాలాచోట్ల పంటలు వరదల తాకిడితో కొట్టుకుపోయాయి. నదులు, వాగు పరీవాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
నీళ్లు ఆగడంతో బిచ్కుంద ప్రాంతంలో పెసర, మినుము, సోయా మొక్కలు కుళ్లిపోతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 76,984 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 410 ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. దాదాపు 54,223 మంది రైతులు నష్టపోయారు. అయితే ఇంకా చాలాచోట్ల పంటలు దెబ్బతిన్నాయని, పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపితే పంట నష్టం పెరిగే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు.


