
క్రైం కార్నర్
బావిలో పడి ఒకరి మృతి
భిక్కనూరు: లక్ష్మిదేవునిపల్లి గ్రామంలో వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు నీట మునిగి ఒకరు మృతిచెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన రైతు రాజేశ్వర్ తన బావిలో ఉన్న మోటర్ పంపు చెడిపోవడంతో మరమ్మతులు చేయించడానికి మంగళవారం కూలీలను పిలిచాడు. ఈక్రమంలో దోమకొండ బాలయ్య (45)అనే కూలీతోపాటు మరో ఇద్దరు బావిలోకి దిగారు. పంపును పైకి తీసుకువస్తుండగా బాలయ్యకు అకస్మాత్తుగా అనారోగ్య సమస్య తలెత్తడంతో నీటిలో పడి, మునిగిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి బాలయ్య మృతదేహాన్ని పైకి తీసుకవచ్చారు. మృతుడికి భార్య సావిత్రి, ఇద్దరూ కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు జరుపుతున్నారు.
లింగంపేటలో..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అయ్యపల్లి తండాలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. ఎస్సై దీపక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా.. అయ్యపల్లి తండాకు చెందిన దేవసోత్ రాములు(65) సోమవారం సాయంత్రం తండా శివారులోకి పశువులను మేపడానికి వెళ్లాడు. ఈక్రమంలో పశువులు చెరువులో దిగడంతో వాటిని బయటకు తీసుకరావడానికి అతడు చెరువులోకి దిగాడు. ప్రమాదవశాత్తు అతడు చెరువులోని గుంతలో మునిగిపోయాడు. వెంటనే స్థానికులు గమనించి అతడిని బయటకు తీశారు. కానీ అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చిరుత దాడిలో లేగదూడ మృతి..?
మాచారెడ్డి: అక్కాపూర్, ఇసాయిపేట అటవీ ప్రాంతంలో ఓ చిరుత కలకలం సృష్టించింది. లేగదూడపై దాడి చేసి చంపింది. వివరాలు.. అక్కాపూర్‌కు చెందిన అరిగె నర్సయ్య సోమవారం రాత్రి లేగదూడను చేను వద్ద కట్టేసి ఇంటికి వచ్చాడు. మంగళవారం ఉదయం అతడు చేను వద్దకు వెళ్లగా లేగదూడ మృతిచెంది ఉంది. వెంటనే అతడు అటవీ అధికారులకు సమాచారం అందించారు. మాచారెడ్డి ఇన్‌చార్జి రేంజ్ అధికారి రమేశ్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. లేగదూడ మెడభాగంలో కొరికిన గాయాలను, తుంటి వద్ద ఉన్న గాయాలను పరిశీలించారు. చిరుత దాడి అనే అనుమానం వ్యక్తం చేసి అటవీ ప్రాంతంలో ట్రాక్ కెమెరాలను అమర్చారు. ఆ ప్రాంతంలో పాద ముద్రలను పరిశీలించారు. రమేష్ మాట్లాడుతూ.. పశువులను అటవీ ప్రాంతంలో మేపవద్దని, ఒంటరిగా వెళ్లొద్దని శివారు ప్రాంత రైతులకు సూచించారు. సెక్షన్ ఆఫీసర్ పారుక్, బీట్ అధికారులు శేఖర్, ప్రశాంత్, మహేశ్వరి, పద్మ ఉన్నారు.

క్రైం కార్నర్