
కేకేవై.. దశ తిరిగేదెప్పుడో?
కరీంనగర్ – కామారెడ్డి – ఎల్లారెడ్డి రహదారి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో అత్యంత కీలకమైన కేకేవై రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలన్న ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు. ఏళ్లు గడుస్తున్నా ప్రతిపాదనల దశ దాటడం లేదు. కనీసం డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) కూడా తయారు కాలేదు. కరీంనగర్ నుంచి సిరిసిల్ల, కామారెడ్డి, ఎల్లారెడ్డి మీదుగా పిట్లం వరకు 165 కిలోమీటర్లు ఉన్న ఈ రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని దశాబ్దాలుగా ప్రజలనుంచి డిమాండ్ ఉంది. ఇందులో దాదాపు 90 కిలోమీటర్లు కామారెడ్డి జిల్లా పరిధిలోనే ఉంటుంది. అయితే 165 కిలోమీటర్ల నాలుగు వరుసల రోడ్డు నిర్మాణానికి రూ. 825 కోట్లు అవసరం అవుతాయని అప్పట్లో ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ రహదారిపై పొద్దస్తమానం వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. ఎప్పుడూ రద్దీగా కనిపిస్తుంది. వేలాది వాహనాలు తిరుగుతుండడం, చాలా చోట్ల మూలమలుపులు, ఇరుకై న వంతెనలు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేస్తే ప్రమాదాలు నివారించడంతోపాటు రవాణా సౌకర్యం కూడా మెరుగుపడుతుంది.
మూడు హైవేలు... మూడు రాష్ట్రాలు..
కరీంనగర్ నుంచి కామారెడ్డి, ఎల్లారెడ్డి మీదుగా పిట్లం వరకు జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తే మూడు జాతీయ రహదారులను అనుసంధానం చేసినట్లవుతుంది. అలాగే తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలకు రాకపోకలు సులభమవుతాయి. కామారెడ్డి మీదుగా వెళ్లే బెంగళూరు, నాగ్‌పూర్ రహదారి (ఎన్‌హెచ్–44), అలాగే ఎల్లారెడ్డి మీదుగా వెళ్లే హైదరాబాద్, మెదక్, బాన్సువాడ రహదారి (ఎన్‌హెచ్ –765 డీ), పిట్లం, మద్నూర్ మీదుగా వెళ్లే సంగారెడ్డి, నాందేడ్, అకోలా రహదారుల(ఎన్‌హెచ్– 161)కు ఈ రోడ్డు కలుస్తుంది. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి దక్షిణ తెలంగాణలోని సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు అలాగే మహారాష్ట్ర, కర్ణాటకలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా.. అలాగే మహారాష్ట్రలోని నాందేడ్, దెగ్లూర్ పట్టణాలతో ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఈ దారి అనుకూలంగా ఉంటుంది. ఈ రహదారి గుండా ఆయా ప్రాంతాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లడానికి మార్గం అనువుగా ఉంటుంది. కర్ణాటకలోని గానుగాపూర్‌లో ఉన్న దత్తాత్రేయ మందిరం, బీదర్‌లో ఉన్న జర్ని నర్సింహ ఆలయం, వేములవాడలోని రాజరాజేశ్వరాలయం, రామారెడ్డి కాలభైరవ ఆలయం, భిక్కనూరు సిద్దరామేశ్వరాలయం.. ఇలా ప్రముఖ ఆలయాలకు వెళ్లడానికి రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది.
జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తే మూడు రాష్ట్రాల మధ్య సరుకు రవాణాకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతుంది. ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఆయా ఉత్పత్తులను రవాణా చేయడం సులువవుతుంది. జుక్కల్ నియోజకవర్గంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పప్పు దినుసులు, సోయా, పత్తి వంటి పంట ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు పంపడానికి ఈ దారి అనుకూలంగా ఉంటుంది. మద్నూర్ ప్రాంతంలో జిన్నింగ్ మిల్లులు ఉండగా, కామారెడ్డి, ఎల్లారెడ్డి, సిరిసిల్ల ప్రాంతాలలో ఉత్పత్తి అయ్యే పత్తిని ఆయా మిల్లులకు తీసుకువెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. ఇవే కాక భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యేందుకు అవకాశాలుంటాయి. ప్రజాప్రతినిధులు దృష్టి సారించి జాతీయ రహదారిని సాధించాలని ప్రజలు కోరుతున్నారు.
165 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ రహదారి పూర్తిగా జహీరాబాద్, కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలోనే ఉంది. జహీరాబాద్ నియోజకవర్గంలో 90 కిలోమీటర్లు ఉండగా, కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గంలో 75 కిలోమీటర్లు ఉంటుంది. కేకేవై రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలన్న డిమాండ్ ఏళ్లుగా ఉంది. ఇటీవల కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి జాతీయ రహదారి నిర్మాణానికి డీపీఆర్ తయారు చేయించి పనులు చేపట్టాలని కోరారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి జాతీయ రహదారి అంశాన్ని తీసుకువెళ్లారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గతంలో కేంద్ర మంత్రిని కలిసి కేకేవై రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తే త్వరలోనే కల సాకారమవుతుందని ప్రజలు భావిస్తున్నారు.
సరుకు రవాణాకు అనుకూలం..
ఎంపీలు దృష్టి సారిస్తేనే..
ప్రతిపాదనల దశ దాటని
ప్రజల డిమాండ్
డీపీఆర్ కూడా తయారు కాని వైనం
ఏళ్లు గడుస్తున్నా
ముందుకు పడని అడుగులు