
16న కామారెడ్డి మీదుగా ‘భారత్ గౌరవ్’ రైలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పంచ జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోవాలని భావిస్తున్న వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక టూరిజం రైలును నడుపుతోంది. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈనెల 16న ప్రారంభం కానుంది. ఎనిమిది రాత్రులు, తొమ్మిది రోజులు సాగే ఈ రైలు.. కామారెడ్డి మీదుగా వెళ్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్, భీమశంకర్, గృష్ణేశ్వర్, మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలను చుట్టి వస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైలు 16వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుందని తెలిపారు. కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్కేడ్, నాందేడ్, పూర్ణ మీదుగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చేరుకుంటుందని, ఆయా క్షేత్రాల దర్శనం అనంతరం తొమ్మిదో రోజు తిరిగి సికింద్రాబాద్‌కు చేరుకుంటుందని వివరించారు. పంచ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనుకునేవారికోసం ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. స్లీపర్ క్లాస్‌లో టికెట్ ధర ఒకరికి రూ.14,700, థర్డ్ ఏసీలో రూ. 22,900, సెకండ్ ఏసీలో 29,900 ఉంటుందని వివరించారు. ప్యాకేజీలో భాగంగా రోజుకు మూడుసార్లు భోజనా లు, వసతి, పర్యాటక రవాణా సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అవసరమైన సమాచారం ఇచ్చేందుకు ప్రతి బోగీలో ఐఆర్‌సీటీసీ సిబ్బంది అందుబాటులో ఉంటారని, బుకింగ్‌తోపాటు పూర్తి వివరాల కోసం (www.irctctourism.com) వెబ్‌సైట్‌లోగానీ, 97013 60701, 92810 30740, 92810 30750, 92810 30711 నంబర్లలోగానీ సంప్రదించాలని సూచించారు.