
చికిత్స పొందుతూ ఒకరు మృతి
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని మాధవపల్లి గ్రామానికి చెందిన నడిపోల్ల భాస్కర్‌రావు(30) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వారం రోజుల క్రితం గాంధారి–కామారెడ్డి రహదారిపై ఆటో, బైక్ ఢీకొన్న ప్రమాదంలో భాస్కర్‌రావు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. బాధితుడు కోమాలోకి వెళ్లడంతో అక్కడి నుంచి నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా శనివారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.
ఫుడ్ డెలివరీ బాయ్..
ఖలీల్‌వాడి: నగరంలోని బస్వాగార్డెన్ వద్ద ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో గాయపడిన యువకుడు శనివారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు నాల్గో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ధర్పల్లి మండలంలోని రామడుగు గ్రామానికి చెందిన గడ్డం కృష్ణ(31) నగరంలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. జూలై 31న రాత్రి 11 గంటలకు వేణుమాల్ నుంచి బస్వారెడ్డి గార్డెన్ వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన కృష్ణను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నట్లు చెప్పారు.

చికిత్స పొందుతూ ఒకరు మృతి