
‘నేరాల అదుపునకు పటిష్ట చర్యలు తీసుకోవాలి’
ఎల్లారెడ్డి: నేరాల అదుపునకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. శనివారం ఆయన ఎల్లారెడ్డి పోలీస్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి, చిల్డ్రన్ పార్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలేజ్ పోలీసింగ్ ఆఫీసర్లు తమకు కేటాయించిన గ్రామాలను తరచూ సందర్శించాలని, గ్రామ పరిస్థితులపై పూర్తి సమాచారం సేకరించాలని పేర్కొన్నారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు. రాత్రి సమయాలలో మరింత పటిష్టంగా పెట్రోలింగ్ నిర్వహిస్తూ నేరాల అదుపునకు కృషి చేయాలన్నారు. సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలన్నారు. అనంతరం మాచాపూర్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సీఐ రాజారెడ్డి, ఎస్సై మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు.