నకిలీ విత్తనాలతో జాగ్రత్త!
కామారెడ్డి క్రైం : ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. రైతులు పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. విత్తనాలు, ఎరువులను సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ప్రతి సీజన్ ప్రారంభంలో అన్నదాతలకు నకిలీ, నాసిరకం విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకోవాలనే కంపెనీలు, వారికి సహకరించే వ్యాపారులు లేకపోలేరు. మాయమాటలతో రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అవకాశం..
కామారెడ్డి జిల్లా పూర్తి వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడ ప్రధాన పంటగా వరి సాగవుతుంది. ఈసారి జిల్లా వ్యాప్తంగా 5.24 లక్షల ఎకరాల్లో వివధ రకాల పంటలు సాగు కావచ్చని అధికారులు అంచనా వేశారు. వరి తర్వాత ప్రధానంగా 52 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 35 వేల ఎకరాల్లో పత్తి, 21 వేల ఎకరాల్లో కంది, 5 వేల ఎకరాల్లో మిరప, కూరగాయల పంటలు సాగు కావచ్చనే అంచనాలున్నాయి. ముఖ్యంగా పత్తి, మిరప, కూరగాయల విత్తనాల కొనుగోలు చేసేటప్పుడు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు ప్రవేశించే అవకాశం ప్రతి యేటా ఉంటుంది. పక్కనే ఉన్న నిర్మల్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడిన ఘటనలు ప్రతి సీజన్‌లోనూ వెలుగుచూస్తున్నాయి. మన జిల్లాలో కూడా చాప కింద నీరులా నకిలీ విత్తనాల విక్రయాలు జరుగుతుంటాయనే ఆరోపణలున్నాయి. గతేడాది సైతం జిల్లాలోని పలు చోట్ల వరి, మొక్కజొన్న, పత్తి విత్తనాలు నకిలీవి రావడంతో రైతులు నష్టపోయిన ఘటనలు వెలుగుచూశాయి.
ప్రత్యేక బృందాల ఏర్పాటు..
జిల్లా యంత్రాంగం పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులతో జిల్లాలో 5 ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. ఆయా బృందాలు నిరంతరం నకిలీ విత్తనాలపై నిఘా ఉంచుతూనే క్రమం తప్పకుండా వ్యాపారుల దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్టు పెడతామని ఇటీవలే కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సైతం ఓ సమావేశంలో హెచ్చరించారు.
నిరంతరంగా తనిఖీలు
ప్రత్యేక టాస్క్‌ఫోర్ బృందాలను ఏర్పాటు చేశాం. జిల్లాలోని అన్ని ఎరువులు, విత్తనాల దుకాణాలను నిరంతరంగా పరిశీలిస్తున్నాం. మండలాల అధికారులు కూడా క్రమం తప్పకుండా దుకాణాలను తనిఖీ చేస్తున్నారు. ఎక్కడైనా నకిలీ వితనాలు విక్రయిస్తే వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకురావాలి. – తిరుమల ప్రసాద్, డీఏవో, కామారెడ్డి
మార్కెట్‌లో నకిలీ, నాసిరకం
విత్తనాల బెడద
మార్కెట్‌లో పొంచి ఉన్న
మోసపూరిత కంపెనీలు
రైతులు అప్రమత్తంగా
ఉండాలంటున్న అధికారులు


