చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కామారెడ్డి క్రైం: రైతులు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం సేకరణపై సమీక్షించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
టార్పాలిన్‌లు అందుబాటులో ఉంచాలి
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా లోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించా రు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, సివిల్ సప్లై కార్పొరేషన్ డీఎం రాజేందర్, డీఎస్‌వో మల్లికార్జునబాబు, జిల్లా సహకార అధికారి రామ్మో హన్, డీఏవో తిరుమల ప్రసాద్, డీఆర్‌డీవో సురేందర్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మహేష్ కుమార్, డీపీఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
జోరుగా ధాన్యం కొనుగోళ్లు..
కామారెడ్డి క్రైం : జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా సాగుతోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా 446 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 62,830 మంది రైతుల నుంచి రూ.776 కోట్ల విలువైన 3.35 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 44,495 మంది రైతులకు రూ.660 కోట్ల వరకు డబ్బులు చెల్లించామని తెలిపారు. 18,570 మంది రైతులు సన్నరకం ధాన్యం విక్రయించారని, వారికి రూ. 73.96 కోట్ల బోనస్ చెల్లింపులకోసం ప్రభుత్వానికి సిఫార్సు చేశామని పేర్కొన్నారు.


