తొలి విడతకు తెర | - | Sakshi
Sakshi News home page

తొలి విడతకు తెర

Nov 27 2026 12:20 AM | Updated on Nov 27 2026 12:20 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది. గ్రామీణ ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎక్కడా పెద్దగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాకినాడ రూరల్‌, కరప, తాళ్లరేవు, పెద్దాపురం, సామర్లకోట మండలాల్లో తొలి విడత ఎన్నికలు నిర్వహించారు. ఈ ఐదు మండలాల్లోని మొత్తం 93 గ్రామ సర్పంచ్‌, 1,094 వార్డు స్థానాలకు అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. వీటిలో 5 గ్రామ పంచాయతీలు, 195 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 88 సర్పంచ్‌, 869 వార్డు సభ్యుల స్థానాలకు గురువారం పోలింగ్‌ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 3,17,009 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా, 2,49,779 మంది ఓట్లు వేశారు. దీంతో, తొలి విడత పల్లెపోరులో 78.79 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇంత పోలింగ్‌ నమోదు కావడం గ్రామీణ ఓటర్ల చైతన్యాన్ని ప్రతిబింబించింది. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మహిళలు, వృద్ధులు, యువత పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్‌ ముగియడంతో అధికారులు వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు. సర్పంచ్‌ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థుల ఫలితాలను విడతలవారీగా ప్రకటించారు. విజయం సాధించిన అభ్యర్థులు, వారి మద్దతుదారులు గ్రామాల్లో సంబరాలు నిర్వహించారు. సర్పంచ్‌ ఫలితాల ప్రకటన అనంతరం ఉప సర్పంచ్‌ ఎన్నిక ప్రక్రియ సైతం చేపట్టారు.

కూటమి మద్దతుదారులకు ఎదురైన సవాల్‌

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఎన్నికల్లో అధికార కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థులకు పలు గ్రామాల్లో గట్టి పోటీ ఎదురైంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలుపై గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న అసంతృప్తి ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాన చర్చగా నిలిచింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల అమలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలను అభ్యర్థుల ముందు ఓటర్లు ప్రస్తావించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులు పలు గ్రామాల్లో విజయం సాధించారు. కూటమి నాయకులు మద్దతు తెలిపిన అభ్యర్థులకు కొన్నిచోట్ల ఓటర్ల నుంచి ఆశించిన స్థాయిలో ఓట్లు దక్కలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగకపోయినా, ప్రధాన రాజకీయ పార్టీలు తమ మద్దతుదారులను గెలిపించుకోవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈ ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీలకు తమ ప్రజాబలాన్ని అంచనా వేసుకునే అవకాశంగా మారాయి. ఈ నెల 29న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

వైఎస్సార్‌ సీపీ మద్దతుదారుల విజయం

ఫలితాలు వెల్లడైన పలు గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. పెద్దాపురం మండలం ఆర్‌బీ పట్నం, ఆర్‌బీ కొత్తూరు, వాలుతిమ్మాపురం, తిరుపతి, మర్లావ, కట్టమూరు గ్రామాల్లో వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. సిరివాడ గ్రామంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు గెలవడంతో రీకౌంటింగ్‌ చేయాలంటూ టీడీపీ మద్దతుదారులు ఆర్‌ఓపై ఒత్తిడి తెచ్చారు. దీంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కరప మండలం కొరుపల్లి, జెడ్‌.భావారం, గురజానపల్లి, పెద్దాపురప్పాడు, సామర్లకోట మండలం అచ్చంపేట, తాళ్లరేవు మండలం చొల్లంగి, కోరంగి, గాడిమొగ, లచ్చిపాలెం, పిల్లంక గ్రామాల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు విజయం సాధించారు.

ప్రశాంతంగా ముగిసిన పల్లెపోరు

78.79 శాతం ఓటింగ్‌ నమోదు

5 మండలాల్లోని

89 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు

పలుచోట్ల వైఎస్సార్‌ సీపీ

బలపరిచిన అభ్యర్థుల విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement