లో
కాకినాడ లీగల్: నగర పాలక సంస్థ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. కాకినాడ నగర మేయర్‌తో పాటు 66 డివిజన్లకు ఈ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల కోసం నగరంలోని 104 ప్రాంతాల్లో 306 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వద్ద ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు, వృద్ధులు, యువ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మొత్తం 58.52 శాతం ఓటింగ్ నమోదైంది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. మేయర్ స్థానానికి 10 మంది, 66 డివిజన్లకు సంబంధించి 323 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, నగర పాలక సంస్థ కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి ఎన్‌వీవీ సత్యనారాయణ సందర్శించారు. పోలింగ్ సరళిని, ఓటింగ్ ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి కాద సత్యశ్రీ, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కాకినాడ సిటీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తమతమ కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ కూడా ఓటు వేశారు.
నిఘా నీడన
అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన 79 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. నగర పాలక సంస్థ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు సీహెచ్ నాగ నరసింహరావు, కమిషనర్ సత్యనారాయణ, అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాస్, వెబ్ కాస్టింగ్ ద్వారా వివిధ కేంద్రాల్లో పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
బాక్సులలో బ్యాలెట్ భద్రం
పోలింగ్ ముగిసిన అనంతరం స్థానిక రంగరాయ మెడికల్ కళాశాల(ఆర్‌ఎంసీ)లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముకు బ్యాలెట్ బాక్సులను తరలించారు. స్ట్రాంగ్ రూము వద్ద భద్రతా ఏర్పాట్లను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎంఎన్ హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన తీరు, సీసీ కెమెరా నిఘా, ఇతర భద్రతా ఏర్పాట్ల గురించి నగర పాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ, ఇతర ఎన్నికల సిబ్బంది కలెక్టర్‌కు వివరించారు. స్ట్రాంగ్ రూముల కోసం కేటాయించిన గదులను, కౌంటింగ్ హాళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన కలెక్టర్ భద్రతా విధులు నిర్వహిస్తున్న అధికారులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకూ కట్టుదిట్టమైన భద్రత కొనసాగించాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకూ తావు లేకుండా నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. తనిఖీల్లో ఆర్‌డీఓ ఎస్.మల్లిబాబు, స్ట్రాంగ్ రూముల భద్రత పర్యవేక్షణకు నియమితులైన నోడల్ అధికారులు, రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఫ్యాన్ వైపే ఓటర్ల మొగ్గు!
నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లు వైఎస్సార్ సీపీ వైపే మొగ్గు చూపారనే విశ్లేషణలు వస్తున్నాయి. దీనికి బలమైన కారణాలను పలువురు చెబుతున్నారు. కాకినాడ మేయర్ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో, టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారనే చర్చ సాగింది. ఈ నేపథ్యంలో మేయర్ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ జరిగి ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి కాద సత్యశ్రీకి అనుకూలంగా టీడీపీ, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుదారుల్లో కొంతమంది ఓటు వేసి ఉంటారనే ప్రచారం పోలింగ్ కేంద్రాల వద్ద వినిపించింది. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల మధ్య కూడా ఇదే అంశంపై చర్చ సాగింది. వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని కొందరు అభిప్రాయపడుతుండగా, మరికొందరు మాత్రం ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందేనని అంటున్నారు. అలాగే, టీడీపీ, బీజేపీల నుంచి కార్పొరేటర్ టికెట్లు ఆశించిన పలువురు నాయకులకు ఈసారి అవకాశం దక్కలేదు. వారిలో కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. వారు బరిలో ఉన్నచోట వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ జరిగిందని చెబుతున్నారు.
ఓటు వేసిన వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి కాద సత్యశ్రీ కుటుంబ సభ్యులు. చిత్రంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న
8
ముగిసిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు
ఉదయం 7 నుంచి సాయంత్రం
5 గంటల వరకు పోలింగ్
మొత్తం ఓటర్లు 2,85,950 మంది
ఓటు వేసింది 1,67,407 మంది
58.52 శాతం ఓటింగ్ నమోదు
నగర ఓటర్ల విముఖత!
కాకినాడ లీగల్: మొత్తంగా చూస్తే ఈ ఎన్నికలపై నగర ఓటర్లు విముఖత చూపినట్లు కనిపించింది. ఓటింగ్ శాతమే దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఇదే రోజు జిల్లాలోని 5 మండలాల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా 78.79 శాతం ఓటింగ్ నమోదైంది. తొమ్మిదేళ్ల కిందట 2017లో జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికల్లో సైతం 67 శాతం ఓటింగ్ నమోదైంది. అటువంటిది ఈసారి 58.52 శాతం పోలింగ్ మాత్రమే జరగడం గమనార్హం. గత ఎన్నికలతో పోలిస్తే సుమారు 8.5 శాతం ఓటింగ్ తగ్గడంపై రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనినిబట్టి నగర ఓటర్లలో చాలా మంది ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారని అర్థమవుతోంది. ఉదయం 11 గంటలకు 76,192 ఓట్లు (26.64 శాతం) పోలయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలైన ఓట్లు 1,14,726కు (40.11 శాతం) పెరిగాయి. మధ్యాహ్నం 3 గంటలకు 1,44,241 (50.43 శాతం) ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 1,67,407 ఓట్లు పోలవగా మొత్తం ఓటింగ్ 58.52 శాతంగా నమోదైంది. ఈ ఎన్నికల్లో మొత్తం 2,85,950 మంది ఓటర్లు ఓటు వేయాల్సి ఉండగా 1,18,543 మంది ఓటుకు దూరమయ్యారు.
ఎన్నో కారణాలు
ఎన్నికల నిర్వహణ హడావుడిగా జరిగిందని, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం కాకినాడకు చెందిన పలువురు ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో నివసిస్తున్నారని, ఎన్నికల రోజున స్వస్థలాలకు చేరుకోలేక ఓటు వేయలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ కూడా ఓటింగ్ శాతం తగ్గడానికి ఒక కారణమై ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2026 జనవరి 1వ తేదీ ప్రామాణికంగా రూపొందించిన ఓటర్ల జాబితా ప్రకారం నగర పాలక సంస్థ పరిధిలో 2,85,949 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల నిర్వహించిన సర్ ప్రక్రియలో సుమారు 60 వేల ఓట్లు తగ్గినట్లు చెబుతున్నారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, ఓటర్ల జాబితాలో మార్పుల సమయంలో స్థానికంగా అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు కూడా ఓటింగ్ తగ్గుదలకు కారణమై ఉండవచ్చనే చర్చ జరుగుతోంది.


