బీచ్‌రోడ్డు(విశాఖపట్నం): మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎంజీసీహెచ్‌ఆర్‌ఐ) మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్రంలో తొలిసారిగా రెట్జియస్ – స్పేరింగ్ రోబోటిక్ రాడికల్ ప్రోస్టేటెక్టమీ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఈ మేరకు శనివారం నగరంలోని ఓ హోటల్లో ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 150 సంక్లిష్ట రోబోటిక్ యూరో–అంకాలజీ శస్త్రచికిత్సలు పూర్తి చేశామన్నారు. వీటిలో 78 ప్రోస్టేట్ శస్త్రచికిత్సలు, 40 పార్షియల్ నెఫ్రెక్టమీలు, 20 రాడికల్ నెఫ్రెక్టమీలు, 10 రాడికల్ సిస్టెక్టమీలు ఉన్నాయన్నారు. రెట్జియస్–స్పేరింగ్ విధానంలో మూత్ర నియంత్రణకు సహాయపడే కీలక శరీర నిర్మాణాలను సాధ్యమైనంత వరకు పరిరక్షిస్తారని, దీంతో ఎంపిక చేసిన రోగుల్లో శస్త్రచికిత్స అనంతరం మూత్ర నియంత్రణ త్వరగా పునరుద్ధరించే అవకాశం ఉంటుందని వివరించారు. రోబోటిక్ పార్షియల్ నెఫ్రెక్టమీ ద్వారా కిడ్నీలోని క్యాన్సర్ కణితిని తొలగిస్తూనే ఆరోగ్యకరమైన కణజాలాన్ని కాపాడవచ్చన్నారు. హెచ్‌సీజీ హాస్పిటల్స్ రీజినల్ బిజినెస్ హెడ్ డాక్టర్ రూపాలి బసు మాట్లాడుతూ ఈ విజయంతో అధునాతన క్యాన్సర్ వైద్య సేవలు రోగులకు మరింత చేరువవుతాయన్నారు. కన్సల్టెంట్ యూరో–అంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ రాహుల్ తేజ్.పి మాట్లాడుతూ అవయవాల పరిరక్షణ, రోగుల భద్రత, వేగంగా కోలుకోవడం, జీవన నాణ్యత మెరుగుపరచడమే తమ లక్ష్యమన్నారు.


