మంచుకొచ్చే వేళలో..! | - | Sakshi
Sakshi News home page

మంచుకొచ్చే వేళలో..!

Nov 21 2026 12:20 AM | Updated on Nov 21 2026 12:20 AM

ఫ పెరుగుతున్న చలి పులి

ఫ వణుకుతున్న జనం

ఫ తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

ఫ ఆరోగ్య సమస్యలతో ప్రజలు సతమతం

అంతకంతకూ పెరుగుతూ..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాయంత్రం 6 గంటల నుంచే చలి గాలులు వీస్తున్నాయి. రాత్రి 10.30 గంటల నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపి పడిపోవడంతో చలి తీవ్రత అంతకంతకు పెరిగిపోతోంది. అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 6 గంటలకు వరకు మంచు కురుస్తూనే ఉంటోంది. విపరీతమైన చలి ఉండడంతో వాహనదారులు ప్రయాణాలు చేయలేక పోతున్నారు. పాఠశాల విద్యార్థులు, పాల వ్యాపారులు, ఆకుకూరలు విక్రయించేవారు, హోటళ్ల నిర్వాహకులు, మార్నింగ్‌ వాకింగ్‌ చేసేవారు, రన్నింగ్‌ చేసే యువత చలితో ఇబ్బందులు పడుతున్నారు. అయినా బయటకు రాక తప్పడం లేదని అంటున్నారు.

ద్వారకాతిరుమల/ కె.గంగవరం: చలి కాలం ముంచుకొస్తుంది.. జనంపై పంజా విసురుతోంది.. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో వణుకు పుట్టిస్తోంది. ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతుండటంతో సాధారణ జన జీవనంపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా తెల్లవారు జామున పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు చలితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకూ జలుబు, దగ్గు బారిన పడుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులే ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు.

ఆరోగ్యంపై చలి పంజా

ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కొద్దీ ప్రజలకు ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు త్వరగా అనారోగ్యానికి గురవుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరంతో పాటు శ్వాస సంబంధిత సమస్యలు కొందరిని వేధిస్తున్నాయి. చలి తీవ్రతతో రక్తనాళాలు సంకోచించడం వల్ల రక్త ప్రసరణపై ప్రభావం పడుతుంది. దీంతో గుండైపె అదనపు భారం పడే అవకాశం ఉంది. గుండె జబ్బులు, మధుమేహం, ఆస్తమా ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారుల్లో కొన్నిసార్లు వాంతులు, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు.

‘ఉన్ని’ంతలో వెచ్చగా..

చలి తీవ్రత పెరగడంతో ఉన్ని దుస్తుల వ్యాపారం ఊపందుకుంది. స్వెట్టర్లు, జర్కిన్లు, మంకీ క్యాప్‌లు, మాస్క్‌ల కొనుగోళ్లకు జనం ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ రాజస్థాన్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేసి శీతాకాలపు దుస్తులను విక్రయిస్తున్నారు. స్వెట్టర్లు రూ. 300 నుంచి రూ. 1,500, అంతకంటే ఎక్కువ ధరల్లోనూ అందుబాటులో ఉన్నాయి. చలి నుంచి రక్షణ పొందేందుకు వీటిని కొనుగోలు చేస్తున్నారు.

జాగ్రత్తలే శ్రీరామరక్ష

శీతాకాలంలో ఆరోగ్యవంతులు సైతం అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాచి చల్లార్చిన నీటిని తాగడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచే పౌష్టికాహారం తీసుకోవాలి. ఉదయం, రాత్రి వేళల్లో చలిగాలులకు ఎక్కువగా గురికాకుండా చూసుకోవాలి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు, ఇతర రక్షణ దుస్తులు ధరించాలి. చల్లటి పానీయాలు, ఐస్‌క్రీమ్‌లకు దూరంగా ఉండాలి. అలర్జీ, జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయరావు.

–ఎ.ప్రవీణ్‌ కుమార్‌,

పీహెచ్‌సీ వైద్యాధికారి,

ద్వారకాతిరుమల

మందులు అందుబాటులో ఉంచాలి

చలి కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలి. గత ఏడాది ప్రాథమిక ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో లేక బయట కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఈ సారి అలాంటి పరిస్థితి రాకుండా చలి కాలంలో వచ్చే రోగాలకు సంబంధించి మందులు పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలి.

–కడలి విజయదుర్గ, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు, పేకేరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement