అన్నవరం: ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం సాయంత్రం రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. ఆలయం వద్ద వారికి దేవస్థానం పండితులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీస్సులు అందజేయగా.. సత్యదేవుని శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలను ఈఓ నల్లం సూర్య చక్రధరరావు అందించారు.
డోనర్ కాటేజీ స్కీమ్‌కు రూ.5 లక్షల విరాళం
అన్నవరం: స్థానిక శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని డోనర్ కాటేజీ స్కీమ్‌కు హైదరాబాద్‌కు చెందిన కేఎస్‌టీవీ చైతన్య, వసుంధరాదేవి దంపతులు శుక్రవారం రూ.5 లక్షలు విరాళంగా సమర్పించారు. వీరికి సత్యదేవుని చిత్రపటం, ప్రసాదం, డోనర్ కాటేజీ స్కీమ్ బాండ్‌ను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఈ రామకృష్ణ, డీఈ రాంబాబు పాల్గొన్నారు.
రెండు కార్లు ఢీ: నలుగురికి గాయాలు
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు మండలం దిగమర్రు బైపాస్ రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. అమలాపురం నుంచి పాలకొల్లు వైపు వస్తున్న కారు, పాలకొల్లు నుంచి చించినాడ వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో అమలాపురం నుంచి వస్తున్న కారులోని యువకులకు తీవ్ర గాయాలు కాగా, వారిని హుటాహుటిన అమలాపురం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పాలకొల్లు కారులో ఉన్న యువతి ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో ప్రాణాలతో బయటపడినప్పటికీ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ధవళేశ్వరం: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వేమగిరి తోట ప్రాంతానికి చెందిన కేతా దుర్గాప్రసాద్ వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం స్నేహితుడు కత్తుల అజయ్‌తో కలసి బైక్‌పై షాపింగ్‌కు రాజమహేంద్రవరం వెళ్లాడు. తిరిగి వేమగిరి వస్తుండగా ధవళేశ్వరం హార్లిక్స్ ఫ్యాక్టరీ సమీపంలో వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొంది. దీంతో అజయ్ రోడ్డు పక్కన పడిపోగా కేతా దుర్గాప్రసాద్ తలపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ టి.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ ఒకరి మృతి
రామచంద్రపురం రూరల్: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందినట్లు ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ శుక్రవారం తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి. వెలంపాలెం శివారు తిర్ణంపేటకు చెందిన అమలకంటి శంకరరావు (56) ఈ నెల 13 న రాత్రి తన ఇంటి దగ్గరలో చలి కాచుకోవడానికి మంట వేసుకున్నాడు. ఒక్కసారిగా మంట పెద్దది కావడంతో పాటు ప్రమాదవశాత్తూ అతను మంటల్లో చిక్కుకున్నాడు. అతడి కేకలకు అక్కడకు చేరుకున్న కుమారుడు వరప్రసాద్ మంటల నుంచి తన తండ్రిని కాపాడే ప్రయత్నంలో అతడి చేతులు కాలిపోయాయి. దీనితో ఇద్దరినీ 108 వాహనంలో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. శంకరరావు చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. దీనిపై అతడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


