అన్నవరం: కార్తిక శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం అన్నవరం సత్యదేవుని ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. సుమారు 60 వేల మంది భక్తులు తరలిరాగా, 6,021 వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.60 లక్షల ఆదా యం వచ్చింది. సత్యదేవుని దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్ దర్శనానికి గంట సమయం పట్టింది. వ్రత మండపాలతో పాటు సత్యదేవుని నిత్య కల్యాణ మండపంలో కూడా స్వామివారి రూ.300 వ్రతాలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం ప్రత్యేక పూజలు చేశారు.
నేడు సత్యదేవుని తెప్పోత్సవం
పంపా నదిలో శనివారం నిర్వహించనున్న సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్ల తెప్పోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. హంస వాహనాన్ని ఇప్పటికే ముస్తాబు చేశారు. సాయంత్రం 6.30 గంటల నుంచి నిర్వహించనున్న ఈ వేడుకను చూసేందుకు వేలాదిగా భక్తులు తరలి రానున్నందున విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. సాయంత్రం ఐదు గంటలకు స్వామి, అమ్మవార్లను రత్నగిరి నుంచి ఊరేగింపుగా పంపా నదీ తీరానికి తీసుకొస్తారు. ఆరు గంటలకు హంస వాహనంపై ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. 6.30 నుంచి 8.30 వరకు పంపా నదిలో స్వామి, అమ్మవార్లు మూడుసార్లు విహరిస్తారు. పెద్దాపురం డీఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు, తుని సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, 150 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్టు ఈఓ ఎన్.సూర్యచక్రధరరావు తెలిపారు.


