ఫ మృతుడి భార్య జయ ఆరోపణ
ఫ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులతో
ఆందోళన
దేవరపల్లి: వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భర్త మృతి చెందాడని గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆ గ్రామానికి చెందిన పిచ్చుకల జయ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం జయ తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడుతూ తన భర్త పిచ్చుకల వెంకటేశ్వరరావు (32)కు గురువారం తెల్లవారు జామున ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకువచ్చినట్టు తెలిపారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న వైద్యుడు పరీక్షించి, గ్యాస్ నొప్పి అని ప్రాథమిక వైద్యం చేసి, మందులు ఇచ్చి పంపారని అన్నారు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికి నొప్పి ఎక్కువ కావడంతో ఉదయం 9 గంటలకు మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ఆసుపత్రికి తీసుకు వెళుతుండగా మార్గం మధ్యలో తన భర్త మృతి చెందినట్టు ఆమె చెప్పారు. గోపాలపురం ఆసుపత్రిలో వైద్యులు సరైన వైద్య పరీక్షలు చేయకపోవడంతో తన భర్త మృతి చెందినట్టు ఆమె ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమకుమారిని వివరణ కోరగా జరిగిన సంఘటనను జిల్లా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినట్టు వివరించారు. ముగ్గురు సభ్యులతో కూడిన బృందం శనివారం సంఘటనపై విచారణ జరుపనున్నట్టు ఆమె తెలిపారు.


