ప్రత్తిపాడు/ ప్రత్తిపాడు రూరల్: ఈతకు వెళ్లిన ఓ బాలుడు శవమై తేలాడు. ప్రత్తిపాడు పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఒమ్మంగి గ్రామానికి చెందిన మొండి వినయ్ శివశంకర్ (13) ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద విచారించినా అతని ఆచూకీ లభించలేదు. దీనిపై ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం తెలిపారు. కాగా రాచపల్లి గ్రామంలోని ఉల్లింకల చెరువులో సోమవారం ఆ బాలుడు శవమై తేలాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఏడో తరగతి చదువుతున్న శివశంకర్ స్నేహితులతో కలసి ఈతకు వెళ్లినట్టు తెలిసిందని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
హాకీలో ఫైనల్స్‌కు చేరిన జిల్లా జట్లు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కడప జిల్లా పలివెందులలో జరుగుతున్న పాఠశాల క్రీడా సమాఖ్య అండర్–19 హాకీ పోటీల్లో జిల్లా బాల బాలికల జట్లు ప్రతిభను కనబరిచి ఫైనల్స్‌కు చేరుకున్నాయని హాకీ కోచ్ రవిరాజు సోమవారం తెలిపారు. బాలుర జట్టు విశాఖ జట్టుపై గెలుపొంది, బాలికల జట్టు కడప జట్టపై విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకున్నాయన్నారు. దీంతో వరుసగా మూడో సంవత్సరం ఫైనల్స్‌కు చేరి హ్యాట్రిక్ సాధించాయని తెలిపారు. ఇరు జట్టు ఫైనల్స్‌లో ప్రతిభను చూపి చాంపియన్ షిప్‌ను సాధిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.
జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపిక
యానాం: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగిన జాతీయ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు యానాం యువకుడు అడపా సంపత్‌కుమార్ ఎంపికయ్యారు. డిసెంబర్ 15 నుంచి 18 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆయన పుదుచ్చేరికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇటీవల పుదుచ్చేరి 8వ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్–2026లో సంపత్‌కుమార్ స్వర్ణపతకం సాధించారు. అదేవిధంగా సీనియర్ విభాగం 72 కిలోల విభాగంలో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుని జాతీయ పోటీలకు అర్హత పొందారు. యునైడెట్ పుదుచ్చేరి అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 14, 15 తేదీల్లో ఉప్పళంలో రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీల్లో స్వర్ణపతకం సాధించారు.


