కాకినాడ లీగల్: కాకినాడ నగరపాలక సంస్థలో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. రెండో రోజైన ఆదివారం అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. కార్పొరేటర్ స్థానాలకు 173 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో రెండు రోజుల్లో కార్పొరేటర్ స్థానాలకు దాఖలైన నామినేషన్ల సంఖ్య 211కు చేరింది. మరోవైపు మేయర్ పీఠం కోసం వివిధ రాజకీయ పార్టీల నుంచి ఏడుగురు నామినేషన్లు సమర్పించారు. నగరంలోని నామినేషన్ కేంద్రాల వద్ద ఆదివారం రాజకీయ సందడి నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసేందుకు తరలివచ్చారు. ఈ వివరాలను అదనపు ఎన్నికల అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ వెల్లడించారు. రెండో రోజు కార్పొరేటర్ స్థానాలకు పార్టీల వారీగా నమోదైన నామినేషన్ల వివరాలను పరిశీలిస్తే.. వైఎస్సార్ సీపీ నుంచి 56, టీడీపీ నుంచి 65, జనసేన నుంచి 40 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నుంచి 7, సీపీఐ నుంచి ఒకటి, సీపీఎం నుంచి ఒకటి, కాంగ్రెస్ నుంచి ఒకటి, ఇతర రాజకీయ పార్టీల నుంచి రెండు నామినేషన్లు నమోదయ్యాయి. వీటితో పాటు స్వతంత్ర అభ్యర్థులు 38 నామినేషన్లు సమర్పించారు. మేయర్ పదవికి వైఎస్సార్ సీపీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఒకరు, జనసేన నుంచి ముగ్గురు, తెలుగు నవగర్జన పార్టీ నుంచి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు.
నేడే చివరి గడువు
నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరి రోజు కావడంతో మరింత మంది అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ తెలిపారు. చివరి రోజు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు రెబల్ అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేసే అవకాశముండటంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కనుంది.
నిష్పక్షపాతంగా ప్రక్రియ
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ఆయన సందర్శించి నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో కల్పించిన సౌకర్యాలు, సీసీ కెమేరాల ఏర్పాటు, భద్రతా చర్యలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం మరింత ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మొత్తం 17 మంది సహాయ రిటర్నింగ్ అధికారులను (ఏఆర్వోలు) కార్పొరేటర్ స్థానాలకు, ఒక ఏఆర్వోను మేయర్ స్థానానికి నియమించినట్లు వివరించారు. వీరి ద్వారా సంబంధిత కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ నెల 26న పోలింగ్ జరగనుందన్నారు. ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఫ కాకినాడలో రెండో రోజు
173 నామినేషన్లు
ఫ మేయర్ పదవికి ఏడుగురి దాఖలు


