ఆదివారం శ్రీ 15 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 15 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

Nov 15 2026 1:32 PM | Updated on Nov 15 2026 1:32 PM

● కాకినాడ మేయర్‌ స్థానంపై మల్లగుల్లాలు

● ‘కూటమి’లో ఇంకా తేలని పంచాయితీ!

● ఎటూ తేల్చని అధిష్టానం

● వార్డుల్లోనూ కుదరని సయోధ్య

సాక్షి, ప్రతినిధి కాకినాడ: కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. మరో రెండు రోజుల్లో ప్రక్రియ ముగియనుంది. నేటికీ కూటమిలో సీట్ల పంపకాల పంచాయితీ తేలడం లేదు. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో బరిలోకి దిగాలన్న విషయమై కూటమి అధిష్టానం ఎటూ తేల్చడం లేదు. మేయర్‌ అభ్యర్థి ప్రకటనపై మల్లగుల్లాలు పడుతోంది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా, నేటికీ మేయర్‌ అభ్యర్థిని ఎవరన్నది ప్రకటించడం లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన నుంచి ఒక్క వార్డుకు సైతం కార్పొరేటర్‌ అభ్యర్థుల ప్రకటన జరగలేదు. ఈ పరిణామంతో ఎవరికి వారు పోటీకి దిగేందుకు సమాయత్తం అవుతున్నారు.

కూటమి సంబంధించి మేయర్‌ పీఠంపై కొన్ని రోజులుగా ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. తొలుత జనసేనకు కేటాయించారని విస్తృత ప్రచారం నడిచింది. తాజాగా టీడీపీకి ఖరారైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సోదరుడి కోడలు మేయర్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. టీడీపీ అధిష్టానం నుంచి అంతర్గతంగా క్లారిటీ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం జనసేన నాయకుల్లో ఆగ్రహావేశాలు నింపుతోంది. ఇన్నాళ్లూ మేయర్‌ పీఠం తమదే అని భావించిన నేతలు ఎవరికి వారు పోటీలోకి దిగేందుకు సన్నద్ధమయ్యారు. పార్టీ అవకాశం ఇస్తే.. తాము మేయర్‌గా పోటీ చేస్తామంటూ విలేకరుల సమావేశాలు, ప్రకటన చేశారు. కూటమి అధినేతల వైఖరి ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లేలా ఉండటంతో అంతర్గతంగా సతమతం అవుతున్నారు.

వైఎస్సార్‌ సీపీలో స్పష్టత

మేయర్‌ స్థానం, కార్పొరేటర్‌ సీట్ల కేటాయింపు విషయంలో వైఎస్సార్‌ సీపీ స్పష్టమైన వైఖరి అవలంబిస్తోంది. ఎన్నికలకు ముందుగానే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థిగా కాదా సత్యశ్రీని ప్రజలకు పరిచయం చేశారు. ఒకేసారి 39 మంది కార్పొరేటర్‌ అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. ఇప్పటికే ఎన్నికల్లో అవలంబించాల్సి వ్యూహాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 16వ తేదీ మంచి రోజు కావడంతో భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజలు ఆశీర్వదించి వైఎస్సార్‌ సీపీ శ్రేణులకు పట్టంగడితే కాకినాడ నగరాన్ని ఎలా అభివృద్ధి చేస్తామన్న విషయమై ప్రజలకు వివరించనున్నారు. స్మార్ట్‌ సిటీని మరింత స్మార్ట్‌గా మార్చేందుకు తీసుకునే చర్యలపై వైఎస్సార్‌ సీపీ క్లారిటీగా ఉంది. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో జరిగిన అవినీతి, విధ్వంసం, ఎన్నికల్లో అరాచకాలు, ప్రజాస్వామ్యానికి పాతరేసిన విధానాలను ప్రజలకు వివరించేందుకు సన్నద్ధమవుతోంది.

మార్పులో మతలబు

తొలుత సీట్ల సర్దుబాటులో భాగంగా కాకినాడ జెడ్పీ చైర్మన్‌, మేయర్‌ పదవులు రెండూ జనసేనకు కేటాయించారు. ఈ నిర్ణయాన్ని ఆది నుంచీ టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో అన్ని పదవులూ జనసేనకే కేటాయిస్తారా..? అని ప్రశ్నించారు. ఇదే డిమాండ్‌ను కూటమి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే.. జెడ్పీ చైర్మన్‌ పీఠం మరింత వివాదానికి దారి తీసింది. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠాన్ని జనసేన మహిళా నేత బుర్రా దివ్య సునీతరాజ్‌ ఆశించారు. ఆమెకు దాదాపు ఖాయమన్న సంకేతాలు వెలవడ్డాయి. అనంతరం టీడీపీకి కేటాయిస్తున్నారని, మాజీ పిల్లి అనంతలక్ష్మి పేరును ఖరారు చేసినట్లు లీకులు వచ్చాయి. దీంతో మనస్తాపానికి గురైన దివ్య సునీతరాజ్‌ పంచాయితీని పవన్‌కల్యాణ్‌ వద్ద పెట్టినట్లు తెలిసింది. పవన్‌ సైతం దివ్యకే సపోర్ట్‌ చేయడంతో ఒక్కసారిగా కథ అడ్డం తిరిగింది. తిరిగి పునరాలోచనలో పడిన కూటమి అధిష్టానం మేయర్‌ పీఠంపై మథనం ప్రారంభించింది.

ఎడతెగని చర్చలు

మేయర్‌, జెడ్పీ చైర్మన్‌ పీఠాల కేటాయింపుపై రెండు రోజులుగా ఆయా పార్టీల అధిష్టానాలు జరుపుతున్న చర్చలు నేటికీ తేలలేదు. సీట్ల సర్దుబాటులో భాగంగా మేయర్‌ స్థానాన్ని జనసేనకు కేటాయించినా.. తమకు జిల్లా పరిషత్‌ ఇవ్వాలని జనసేన గట్టిగా డిమాండ్‌ చేస్తోంది. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ కుండబద్దలు కొడుతోంది. జనసేన డిమాండ్‌కు అనుగుణంగా టీడీపీ సైతం మరో విషయం తెరపైకి తెచ్చింది. జెడ్పీ చైర్మన్‌ మీరు తీసుకుంటే.. మేయర్‌ తమకు వదిలేయాలంటూ కోరినట్లు తెలిసింది.

ఎవరికి వారే..

మేయర్‌, వార్డు కార్పొరేటర్‌ స్థానాల సర్దుబాటుపై నేటికీ క్లారిటీ రాకపోవడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎవరికి వారు అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు సమయం సైతం ఎక్కువ లేకపోవడం, ఆపై తుపాను హెచ్చరికల నేపథ్యంలో తాము ఎప్పుడు ప్రచారం చేసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేయర్‌ టీడీపీకి కేటాయిస్తే.. జనసేన నేతలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని భావిస్తున్న నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు కార్పొరేటర్‌ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న నాయకులు తమకు అవకాశం దక్కకపోతే రెబల్‌ అభ్యర్థులుగానైనా దిగేందుకు వెనుకాడటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement