కాకినాడ లీగల్: కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ, అదనపు ఎస్పీ కిషోర్ వెల్లడించారు. పాత నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటైన నామినేషన్ కేంద్రాలను వారు పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ 66 డివిజన్లకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు 17 మంది రిటర్నింగ్ అధికారులను నియమించామని తెలిపారు. అదనపు ఎస్పీ కిషోర్ మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాలకు అభ్యర్థితో పాటు ఇద్దరు, ముగ్గురు వ్యక్తులను మాత్రమే లోపలకు అనుమతిస్తామని చెప్పారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు తావులేకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ (ఎస్‌ఎస్‌టీ)లను ఏర్పాటు చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం, బహుమతులు పంపిణీ చేస్తే చర్యలు తప్పవని అన్నారు. ఎన్నికల విధుల కోసం మొత్తం నాలుగు బృందాలుగా ఏర్పాటు చేసిన ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ సభ్యులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వారి విధులు, బాధ్యతలు, తనిఖీల నిర్వహణ, ఫిర్యాదులపై స్పందించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు.


