రాజానగరం: జాతీయ విద్యా విధానం లక్ష్యాలకు అనుగుణంగా భారతీయ భాషల అభివృద్ధి, విస్తరణతో పాటు పాఠ్య పుస్తకాల రూపకల్పన, బోధనలో ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని మరింత పెంపొందించేలా ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఈ నెల 27, 28వ తేదీల్లో జాతీయ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ బ్రోచర్‌ను శనివారం వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, భారతీయ భాష సమితి సహకారంతో యూనివర్సిటీలోని ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. కన్వీనర్‌గా హెచ్‌ఓడీ ఆచార్య కేఎస్ రమేష్, కో కన్వీనర్లుగా ఆచార్య డి.జ్యోతిర్మయి, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ బయోటెక్నాలజీ అధ్యాపకుడు ఆచార్య డి.మురళీధరరావు వ్యవహరిస్తారన్నారు.
విశ్రాంతి గదుల నిర్మాణానికి రూ.10 లక్షల విరాళం
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో విశ్రాంతి గదుల నిర్మాణానికి హైదరాబాద్ (తెల్లాపూర్) వాస్తవ్యులు ఉండవల్లి వీర వెంకట రమణ, వెంకట సునీత, కుటుంబ సభ్యులు శనివారం రూ.10 లక్షల విరాళం సమర్పించారు. స్వామివారి దర్శనం అనంతరం వీరికి ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీసులు అందించారు. దాతలకు ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు స్వామివారి చిత్రపటం అందజేశారు.
యువకుడి హత్య కేసు రీ కనస్ట్రక్షన్
తాళ్లరేవు: పెదబొడ్డు వెంకటాయపాలెం యువకుడు సంగాడి కామేష్ వర్మ హత్య కేసుకు సంబంధించి కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ నేతృత్వంలో కోరంగి పోలీసులు శనివారం రీ కనస్ట్రక్షన్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకువచ్చి వివరాలు తెలుసుకున్నారు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు కోరంగి పంచాయతీ పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన పాలెపు సతీష్, పినపోతు కేశవ, సంగాడి దుర్గామల్లేశ్వరరావు, సంగాడి కామేష్ వర్మ స్నేహితులు. వీరిలో సతీష్, కేశవ, మల్లేశ్వరరావు చేసిన దొంగతనాల గురించి కామేష్ గ్రామస్తులకు పోలీసులకు సమాచారం ఇస్తున్నాడన్న అనుమానంతో పైముగ్గురూ కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 28వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో కామేష్ ఇంటికి వెళ్లి, అతడిని తమ వెంట తీసుకువెళ్లారు. సీతారామపురం కోలాటివారి రేవు వద్ద కామేష్‌ను కొట్టి, పీక నొక్కి రేవులో పడవేశారు. ఆ నేరానికి సంబంధించి నిందితుల్లో ఒకడైన సంగాడి దుర్గామల్లేశ్వరరావును అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా, 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ కేసుకు మిగిలిన ఇద్దరూ పలువురి దాడిలో గాయపడి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మత్స్యకారులకు ముగిసిన శిక్షణ
కాకినాడ రూరల్: వాతావరణ మార్పులను తట్టుకునే సుస్థిర మత్స్య పరిశ్రమ, ఆక్వా కల్చర్‌లపై కాకినాడ, తూర్పుగోదావరి, మార్కాపురం, కోనసీమ జిల్లాలకు చెందిన 13 మంది మత్స్యకారులకు కాకినాడ ఎస్‌ఐఎఫ్‌టీలో మూడు రోజులు ఇచ్చిన శిక్షణ శనివారంతో ముగిసింది. ఎస్‌ఐఎఫ్‌టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాలపై లోకేష్ రామ్, అనుకూల వ్యూహాలపై కె.వీరాంజనేయులు, చెరువు రూపకల్పన, ఐఎంటీఏ పద్ధతులపై డాక్టర్ సుధాకర్ అవగాహన కల్పించారు. క్షేత్ర స్థాయిలో ఉప్పాడ తీరం, మడ అడవులను శిక్షణార్థులు సందర్శించగా వారికి ఎఫ్‌డీఓ నాగబాబు, ఏడీఎఫ్ కిరణ్‌కుమార్‌లు ఉత్తమ ఆక్వా క్షేత్రాలు, వినూత్న ఆక్వా సాగు గురించి వివరించారు. ముగింపు కార్యక్రమంలో ఎస్‌ఐఎఫ్‌టీ ప్రిన్సిపాల్ డాక్టరు అంజలి వాతావరణ మార్పులను తట్టుకునే పద్ధతులు తెలియజేశారు.


