కిరాణా దుకాణంలో అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

కిరాణా దుకాణంలో అగ్ని ప్రమాదం

Nov 14 2026 12:53 AM | Updated on Nov 14 2026 12:53 AM

కరప: నడకుదురు గ్రామంలోని కిరాణా అండ్‌ జనరల్‌ స్టోర్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు రేగి షాపులోని సరుకులు, సామగ్రి కాలి బూడిదైందని బాధితుడు సత్యవరపు నాగేశ్వరరావు తెలిపాడు. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రమాదం సమాచారాన్ని అందుకున్న వెంటనే కాకినాడ నుంచి ఫైరింజన్‌ వచ్చి మంటలను అదుపు చేసింది.

రోడ్డుపై శిశువు మృతదేహం

ప్రత్తిపాడు: నవజాత శిశువు మృతదేహంతో శుక్రవారం ఉదయం ప్రత్తిపాడులో కలకలం రేగింది. స్థానిక సామాన్య జనరల్‌ ఆస్పత్రి సమీపంలో శిశువు మృతదేహాన్ని కుక్కలు తింటుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లారు. ఎస్సై ఎస్‌.లక్ష్మీకాంతం ఈ ఘటన పూర్వాపరాలను పరిశీలిస్తున్నారు. కాగా.. ఆస్పత్రి ఎదురుగా టీవీఎస్‌ షోరూం పక్కన గురువారం రాత్రి కొందరు ఈ శిశువు మృతదేహాన్ని వదిలివెళ్లారని సమాచారం.

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన

కాకినాడ క్రైం: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాల్య వివాహ్‌ ముక్త్‌ భారత్‌ 100 రోజుల ప్రచార కార్యక్రమంలో భాగంగా అధికారులు శుక్రవారం బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ మేరకు ఐసీడీఎస్‌ పీడీ చెరుకూరి లక్ష్మి ఆధ్వర్యంలో డీసీపీవో చదలవాడ వెంకట్రావు పర్యవేక్షణలో కాకినాడలోని శ్రీనగర్‌ బాలికోన్నత పాఠశాలలో సదస్సు జరిపారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి జె.విజయ మాట్లాడుతూ బాలల రక్షణకు సంబంధించిన చట్టాలు, బాలలపై జరిగే హింస, వేధింపులు, బాల కార్మిక దురావస్థ, అక్రమ రవాణా అంశాలను వివరించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను ప్రస్తావిస్తూ చట్టరీత్యా బాల్య వివాహాలు నిర్వహించడం, ప్రోత్సహించడం, హాజరుకావడం నేరమని తెలిపారు. ఇటువంటి దురాచారాలకు బలైపోతున్న బాలల వివరాలను 1098 చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు తెలియజేయాలని కోరారు. సమాజంలో అన్ని వర్గాల భాగస్వామ్యంతోనే బాల్య వివాహ దురాచారాన్ని అంతం చేయగలమని తెలిపారు. అనంతరం డీసీపీయూ కౌన్సిలర్‌ బి.దుర్గారాణి బాలల చేత బాల్య వివాహ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీసీపీయూ సోషల్‌ వర్కర్‌ చినబాబు, శిశుగృహ సోషల్‌ వర్కర్లు లక్ష్మి, రేవతి, జీఎంఎస్‌కేలు పరిమళ, ప్రమీల, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement