గండేపల్లి: సూరంపాలెం పరిధిలోని ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్సై యూవీ శివ నాగబాబు తెలిపారు. రాజమహేంద్రవరానికి చెందిన దీక్షితుల లలిత సుబ్రహ్మణ్యం (18) గురువారం ఆ కళాశాల భవనం పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చికిత్స నిమిత్తం కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన విషయం పాఠకులకు విధితమే. చికిత్స పొందుతున్న సుబ్రహ్మణ్యం గురువారం రాత్రి మృతి చెందాడని, తండ్రి శ్రీనివాసమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుక్క అడ్డురావడంతో ఆటో బోల్తా : డ్రైవర్ మృతి
రాజమహేంద్రవరం రూరల్: ఆటో బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన బొమ్మూరులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హుకుంపేట వెంకటగిరి ప్రాంతానికి చెందిన పెంటగట్ల రాంబాబు (45) అద్దె ఆటోలో పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. ప్రతి రోజు రాజవోలులో అద్దె ఆటో తీసుకుని దివాన్‌చెరువు వెళ్లి పండ్లు కొనుగోలు చేసి, బొమ్మూరు పెట్రోల్ బంకు వద్ద విక్రయిస్తుంటాడు. గురువారం రాత్రి ఆటోను యజమానికి ఇచ్చేందుకు రాజవోలుకు వెళ్తుండగా, బొమ్మూరు ఎలక్ట్రికల్ ఆఫీస్ ఎదురుగా కుక్క అడ్డొచ్చింది. దీంతో సడన్ బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా పడింది. డ్రైవర్ రాంబాబుకు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య పెంటగట్ల వరలక్ష్మి శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొమ్మూరు ఎస్సై జుబేర్ కేసు నమోదు చేశారు.
మోటార్ సైకిల్ అదుపు తప్పి వ్యక్తి మృతి
గండేపల్లి/జగ్గంపేట: మోటార్ సైకిల్ అదుపు తప్పడంతో రోడ్డుపై పడిపో యి ఓ వ్యక్తి మృతి చెందాడు. జగ్గంపేట ఎస్సై టి.రఘునాథరావు తెలిపిన వివరాలివి.. గోకవరం మండలం మల్లవరానికి చెందిన తోట దుర్గా ప్రసాద్ (22) గురువారం రాత్రి మోటార్ సైకిల్‌పై ఇంటి నుంచి జగ్గంపేట వైపు వస్తున్నాడు. రాజపూడి శివారు సిరామిక్స్ ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డు మరమ్మతులు జరుగుతున్న ప్రదేశంలోకి వచ్చేసరికి మోటార్ సైకిల్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్ తలకు తీవ్రగాయమై మృతి చెందాడు. మృతదేహానికి గండేపల్లి మండలం జెడ్.రాగంపేట సీహెచ్‌సీలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
కపిలేశ్వరపురం (మండపేట): మండపేట పట్టణం న్యూకాలనీలోని చెట్టుకు కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామానికి చెందిన దోనేపూడి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ (34) శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణ సీఐ వాసంశెట్టి శ్రీనివాస్ కథనం ప్రకారం... విద్యాసాగర్ గతంలో ఆర్‌ఎంపీ వైద్యుడిగా పని చేశాడు. తర్వాత కాలంలో రాయవరానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి వద్ద పని చేస్తున్నాడు. ఆర్థిక సమస్యలు కారణంగా అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా తెలియవచ్చింది.


