అత్త మందలించిందని కోడలి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అత్త మందలించిందని కోడలి ఆత్మహత్య

Nov 14 2026 12:53 AM | Updated on Nov 14 2026 12:53 AM

సీతానగరం: ఖాళీ కడుపుతో ఉన్న పిల్లాడికి జ్వరం మందు (సిరప్‌) పట్టించొద్దని అత్త మందలించడంతో కోడలు ఆత్మహత్య చేసుకుంది. సీతానగరంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ విషాద ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరానికి చెందిన సత్య శ్యామలాంబిక (22)కు సీతానగరానికి చెందిన గుర్రం వీర ఫణింద్రతో వివాహమైంది. ఈ దంపతులకు రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. వీర ఫణీంద్ర ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అత్తతో కలిసి శ్యామలాంబిక సీతానగరంలో ఉంటోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం శ్యామలాంబిక తన కుమారుడికి జ్వరం రావడంతో రెండు సిరప్‌లను కలిపి ఒకే మూతలో వేసి పట్టబోతుంటే అత్త సూర్యకుమారి మందలించింది. ఖాళీ కడుపుతో ఉన్న పిల్లాడికి సిరప్‌లు పట్టవద్దని చెప్పి, పిల్లాడికి అన్న తినిపించడానికి బయటకు వచ్చింది. దీంతో శ్యామలాంబిక ఇంటి తలుపులు వేసుకుని, ఉరి వేసుకుంది. అనంతరం మరిది పొలం నుంచి వచ్చి తలుపులు వేసి ఉన్నాయని తెలపడంతో చుట్టు పక్కల వారు వచ్చి చూడగా ఇంటిలో ఉరి వేసుకుని కనిపించింది. శ్యామలాంబిక మావయ్య మృతదేహాన్ని కిందకు దించి, స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కాగా.. సమాచారం అందుకున్న మృతురాలి తల్లిదండ్రులు సీతానగరం చేరుకుని, తన కుమార్తె మృతికి అత్త, మరిది కారణమని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement