వైఎస్సార్‌ సీపీలో జోష్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో జోష్‌

Nov 13 2026 12:28 AM | Updated on Nov 13 2026 12:28 AM

● ఆ పార్టీ మేయర్‌ అభ్యర్థి ఖరారు

● కూటమిలో తేలని పంచాయితీ

సాక్షి ప్రతినిధి, కాకినాడ: నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. రెండున్నరేళ్లుగా కూటమి ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల వ్యవహార శైలి, అక్రమాలతో ప్రజలు విసుగెత్తిపోయారు. మద్యం, ఇసుక అక్రమ రవాణా, అభివృద్ధి పనుల్లో పర్సంటేజీలు, నగర అభివృద్ధిపై కనీస శ్రద్ధ చూపకపోవడంతో కూటమి నేతలు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఈ పరిస్థితులు వైఎస్సార్‌ సీపీకి పట్టం కట్టే విధంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామం వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో జోష్‌ను రెట్టింపు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నికల నోటిషికేషన్‌ విడుదల రోజునే తన మేయర్‌ అభ్యర్థి పేరును ఆ పార్టీ ప్రకటించింది.

వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థిగా సత్యశ్రీ:

వైఎస్సార్‌ సీపీ నుంచి కాకినాడ మేయర్‌ అభ్యర్థిగా నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడు కాద వెంకట రమణ సతీమణి సత్యశ్రీ బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు డాక్టర్‌ వెంకట రమణ తన కుటుంబ సభ్యులతో సహా గురువారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో వారు వైఎస్సార్‌ సీపీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కూటమిలో సీన్‌ రివర్స్‌

మరోవైపు అధికార కూటమిలో మేయర్‌ పీఠంపై ముష్టియుద్ధం మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కాకినాడ మేయర్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ స్థానాలు రెండూ జనసేనకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం, జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవిని టీడీపీకి ఇచ్చేందుకు అనూహ్యంగా రంగం సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో, మనస్తాపం చెందిన జనసేన జెడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి బుర్రా దివ్య సునీతారాజ్‌ తనకే ఆ పదవి దక్కాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సైతం ఆమెకే మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా నగర రాజకీయం ప్రస్తుతం ఊహించని మలుపు తిరిగింది. జెడ్పీ చైర్‌పర్సన్‌ జనసేనకు ఇస్తే.. కాకినాడ మేయర్‌ స్థానాన్ని టీడీపీ ఇవ్వాలంటూ ఆ పార్టీ శ్రేణులు పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రధానమైన రాజమహేంద్రవం మేయర్‌ స్థానాన్ని బీజేపీకి, కాకినాడ జనసేనకు కేటాయిస్తే తమ పరిస్థితేమిటని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ మేయర్‌ పంచాయితీనికి టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. మేయర్‌ సీటును టీడీపీకి కేటాయిస్తే.. ఎమ్మెల్యే కొండబాబు తాలూకు అభ్యర్థిని బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పరిణామం జనసేన శ్రేణులకు మింగుడు పడటం లేదు. తమ స్థానాన్ని టీడీపీ ఎత్తుకుపోతే చూస్తూ ఊరుకునేది లేదంటూ అగ్గిమీద గుగ్గిలవుతున్నట్లు చెబుతున్నారు.

అవకాశం ఇస్తే అభివృద్ధి

చేసి చూపుతాం

ప్రజలు ఆశీర్వదించి మేయర్‌గా అవకాశం కల్పిస్తే నగరాభివృద్ధికి కృషి చేస్తాను. ప్రధానంగా నాలుగు అంశాల అమలుకు కృషి చేస్తాను. ప్రజా సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు విద్య, ఉపాధి అవకాశాలు, మహిళల అభ్యున్నతి, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, ప్రజలకు జవాబుదారీగా ఉండే పరిపాలన, కాకినాడ నగర అభివృద్ధికి అహర్నిశలూ పని చేయడమే నా లక్ష్యం. – కాదా సత్యశ్రీ,

వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థి

సేవా కార్యక్రమాలతో..

వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థి కాద సత్యశ్రీ ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, ప్రజా సేవతో సంబంధం ఉన్న కుటుంబానికి చెందిన వారు. ఆమె భర్త డాక్టర్‌ వెంకట రమణ వైద్య నిపుణుడు. కాకినాడలోని శ్రీ బాలా త్రిపుర సుందరీ హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సత్య స్కాన్‌ అండ్‌ డయాగ్నోస్టిక్స్‌లో చీఫ్‌ కన్సల్టెంట్‌ రేడియాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. సత్య చారిటబుల్‌ ట్రస్ట్‌తో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

బయోడేటా

పేరు కాద సత్యశ్రీ

పుట్టిన తేదీ 1973 జూలై 15

నివాసం కాకినాడ

భర్త డాక్టర్‌ కాద వెంకట రమణ

వృత్తి 2011 నుంచి సత్య స్కాన్స్‌ అండ్‌ డయాగ్నోస్టిక్స్‌ సంస్థ నిర్వాహకురాలు. సత్య చారిటబుల్‌ ట్రస్ట్‌ కార్యకలాపాల సమన్వయకర్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement