ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించను : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించను : కలెక్టర్‌

Nov 13 2026 12:28 AM | Updated on Nov 13 2026 12:28 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యాన్ని, నిబంధనల ఉల్లంఘనను సహించేది లేదని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ అన్నారు. జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందస్తు ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఎన్నికల నిర్వహణపై ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులతో కలెక్టరేట్‌ నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లారు. మండలాల వారీగా ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై సమీక్షించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ, ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కాకినాడ రూరల్‌, కరప, కాజులూరు, తాళ్లరేవు మండలాల్లో ఈ నెల 26న మొదటి విడత పోలింగ్‌ జరుగుతుందన్నారు. పొరుగు జిల్లాల నియోజకవర్గాల పరిధికి చెందిన కాజులూరు, తాళ్లరేవు మండలాలపై పునఃసమీక్ష అనంతరం తుది నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధిత ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ అన్నారు.

రూ.5,00,116 విరాళం

పిఠాపురం: గొల్లప్రోలుకు దంగేటి అప్పన్న (తాతారావు) పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం నిత్యాన్నదాన ట్రస్టుకు గురువారం రూ 5,00,116 విరాళం అందజేశారు. ఈ మొత్తాన్ని కార్తిక పౌర్ణమికి రూ.2.50 లక్షలు, వైకుంఠ ఏకాదశికి రూ.2,50,116 చొప్పున కేటాయించి, ఆ రోజుల్లో తన పేరిట అన్నదానం జరిపించాలని కోరారు. దాతకు ఈఓ కాట్నం జగన్మోహన్‌ శ్రీనివాస్‌ ఆలయ మర్యాదలతో దర్శనం, పండితుల ఆశీర్వచనం, అన్నదాన పథకం బాండ్‌, స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు.

వాడపల్లి వెంకన్నకు

రూ.2.91 కోట్ల రాబడి

ఆత్రేయపురం: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి హుండీల ద్వారా 49 రోజులకు రూ.2,91,06,115 ఆదాయం లభించింది. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ నల్లం సూర్యచక్రధరరావు ఈ విషయం తెలిపారు. ఆలయంలోని హుండీల ఆదాయాన్ని జిల్లా దేవదాయ శాఖ అధికారి కె.లక్ష్మీనారాయణశెట్టి, రాజమహేంద్రవరం తనిఖీదారు ఎస్‌టీపీటీ శ్రీనివాస్‌, గ్రూపు దేవాలయాల ఈఓ పీవీవీఎస్‌ కామేశ్వరరావుల గురువారం సమక్షంలో లెక్కించామని వివరించారు. విశ్వేశ్వర స్వామి ఆలయ హుండీలతో కలిపి ప్రధాన హుండీల ద్వారా రూ.2,42,49,560, అన్న ప్రసాదం హుండీల ద్వారా రూ.48,56,555 లభించాయని తెలిపారు. అలాగే, బంగారం 39.500 గ్రాములు, వెండి 1.607 కిలోలు, 16 దేశాలకు చెందిన 136 కరెన్సీ నోట్లు లభించాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

బాలాజీ హుండీల ఆదాయం

రూ.37.48 లక్షలు

మామిడికుదురు: అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. మొత్తం 72 రోజులకు హుండీల ద్వారా రూ.36,48,325 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఎం.రాంబాబురెడ్డి తెలిపారు. ఎండోమెంట్స్‌ తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరిగింది. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మొల్లేటి చక్రపాణి, పలువురు సేవకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement