● దమ్ముంటే అధికారులతో
ప్రమాణం చేయించాలి
● వైఎస్సార్ సీపీ నాయకుల సవాల్
ఏలేశ్వరం: ఇటీవల జరిగిన ఏలేశ్వరం మున్సిపల్ ఎన్నికల్లో న్యాయబద్ధంగా ఎవరు గెలిచారో ప్రజలందరికీ తెలుసని వైఎస్సార్ సీపీ నాయకులు అన్నారు. ఈ ఎన్నికల్లో తాము న్యాయబద్ధంగా గెలిచామంటూ ఎక్కడ ప్రమాణం చేయడానికై నా సిద్ధమని కూటమి నాయకులు చేసిన సవాల్‌కు వైఎస్సార్ సీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ తరఫున చైర్‌పర్సన్‌గా పోటీ చేసిన బదిరెడ్డి ఆశాలత ఇంటివద్ద గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బదిరెడ్డి గోవిందు మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నాడు కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడి, దొడ్డిదారిన గెలిచి, తిరిగి తమపై బురద జల్లడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కూటమి నాయకులకు దమ్ముంటే కౌంటింగ్ నాడు అక్రమాలకు పాల్పడిన జాయింట్ కలెక్టర్, పెద్దాపురం ఆర్‌డీఓలతో తాము తప్పు చేయలేదంటూ స్థానిక శివాలయంలో ప్రమాణం చేయించాలని డిమాండ్ చేశారు. కౌంటింగ్ నాడు తేడా వచ్చిన 11 ఓట్ల సంగతి తేలుస్తామని చెప్పిన ఆర్‌డీఓ జాడ లేకపోగా.. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా, కౌంటింగ్ పూర్తి కాకుండానే టీడీపీ అభ్యర్థి గెలిచినట్టు జాయింట్ కలెక్టర్ ఏకపక్షంగా ప్రకటించారని చెప్పారు. తన షాపులపై దాడి చేసిన ఫలితంగా సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యేకి వచ్చిన మెజార్టీ మున్సిపల్ ఎన్నికల్లో 200కు పడిపోయిందని, ఇదే నాయకులతో ముందుకు సాగితే పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోవాలని హితవు పలికారు. దొడ్డిదారిన గెలిచిన కూటమి ప్రభుత్వం ప్రజలకు నిజాయతీగా పాలన అందించాలని డిమాండ్ చేశారు. ఎటువంటి అవినీతికి పాల్పడినా తమ పార్టీ తరఫున నిరంతరం పోరాటాలు చేస్తామని గోవిందు హెచ్చరించారు. 17వ వార్డు కౌన్సిలర్ సామంతుల సూర్యకుమార్ మాట్లాడుతూ, తనపై ఆరోపణలు చేసిన వ్యక్తికి నిజాయతీ లేదన్నారు. ఆయన ఆరోపణలకు విలువ లేదన్నారు. పార్టీ నేత కోరాడ ప్రసాద్ మాట్లాడుతూ, 15వ వార్డులో ఎన్ని అక్రమాలు చేసినా, అడ్డుకోగలిగామని, చివరికి తన భార్య గెలిచారని చెప్పారు. బదిరెడ్డి ఆశాలత మాట్లాడుతూ, చైర్‌పర్సన్ అక్షిత నిజాయతీగా పరిపాలన సాగించి గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. పార్టీ నేతలు శిడగం వెంకటేశ్వరరావు, సుంకర రాంబాబు కూడా మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నేతలు జువ్విన వీర్రాజు, వాగు బలరామ్, పైల విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


