సాక్షి ప్రతినిధి, కాకినాడ: హెచ్‌ఐవీ రోగుల్లో సంక్రమించే అరుదైన నరాల సంబంధిత పక్షవాతం ‘గిల్లయిన్–బారీ సిండ్రోమ్’(జీబీఎస్)పై కాకినాడకు చెందిన ఎయిడ్స్, సాంక్రమిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ యనమదల మురళీకృష్ణ కీలక పరిశోధనలు చేపట్టారు. దీనిపై ఆయన చేసిన అధ్యయనం ప్రపంచ ప్రఖ్యాత సేజ్ సంస్థ నిపుణుల సమీక్షతో ప్రచురించే జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ప్రొవైడర్స్ ఆఫ్ ఎయిడ్స్ కేర్‌లో తాజాగా ప్రచురితమైందని ఆయన గురువారం తెలిపారు. హెచ్‌ఐవీ రోగులు తరచూ అనేక ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నా.. వారిలో జీబీఎస్ కేసులు ఇప్పటి వరకూ తగిన స్థాయిలో నమోదు కాలేదన్నారు. తన వైద్య కేంద్రంలో ఆరు నెలల్లో 139 మంది హెచ్‌ఐవీ రోగులను పరిశీలించగా.. ఎనిమిది మందిలో మాత్రమే క్లినికల్‌గా జీబీఎస్ లక్షణాలను గుర్తించామన్నారు. ఈ రోగులు ఇతర ఇన్ఫెక్షన్లతో సైతం బాధపడుతున్నారన్నారు. అందువల్ల జీబీఎస్‌కు హెర్పిస్ వైరస్‌లే కారణమని పరిశోధన కచ్చితంగా తేల్చలేదన్నారు. వెన్నుపాము ద్రవ పరీక్షలు, నరాల పనితీరు, వైరస్ పీసీఆర్ వంటివి అందుబాటులో లేని ప్రాంతాల్లో రోగుల లక్షణాలను సమగ్రంగా పరిశీలించి, జీబీఎస్‌ను త్వరగా గుర్తించడం, తగిన వైద్యం అందించడం కీలమని తన పరిశోధనలో ఆయన స్పష్టం చేశారు. సకాలంలో చికిత్స అందించగా.. ఎనిమిది మందిలో ఏడుగురు కోలుకున్నారని వెల్లడించారు. దీనిపై భవిష్యత్తులో మరింత నిర్ధారణాత్మక పరిశోధనలు జరగాల్సి ఉందని యనమదల తెలిపారు.


