బియ్యం దుకాణాలపై దాడులు | - | Sakshi
Sakshi News home page

బియ్యం దుకాణాలపై దాడులు

Nov 13 2026 12:22 AM | Updated on Nov 13 2026 12:22 AM

అమలాపురం టౌన్‌: అమలాపురంలోని పలు బియ్యం దుకాణాలపై రాజమహేంద్రవరం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, మరో మూడు ప్రభుత్వ శాఖల అధికారుల బృందం గురువారం ఆకస్మిక దాడులు చేసింది. విజిలెన్స్‌ సీఐ ఎం.శేఖర్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో ఫుడ్‌ సేఫ్టీ, వెయిట్‌ అండ్‌ మెజర్‌మెంట్స్‌, జీఎస్‌టీ అధికారులు పాల్గొని ఆయా దుకాణాల్లో స్టాక్‌లను, ధరలను తనిఖీలు చేశారు. స్థానిక అశోక్‌ నగర్‌లోని సత్యనారాయణ రైస్‌ జనరల్‌ మర్చంట్స్‌, గాంధీ బజార్‌లో గణపతి రైస్‌ షాపుల్లో బియ్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. వీటికి ఫుడ్‌ లైసెన్సులు కూడా లేనట్టు జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి వై.రామయ్య గమనించి నోటీసులు జారీ చేశారు. ఆ దుకాణాల్లో బియ్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్నందుకు కేసులు నమో దు చేసినట్లు విజిలెన్స్‌ సీఐ శేఖర్‌బాబు తెలిపారు.

ఆవును ఢీకొని

పోర్టు కూలీ మృతి

తాళ్లరేవు: జాతీయ రహదారి 216లో కోరంగి సుబ్బారాయుని దిమ్మ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెమ్మాడి విజయ్‌కుమార్‌ (28) అనే పోర్టు కూలీ మృతి చెందాడు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గాడిమొగ పంచాయతీ చినవలసల గ్రామానికి చెందిన విజయ్‌ కాకినాడ పోర్టులో కూలిగా పనిచేస్తున్నాడు. ఖాళీ సమయాలలో రొయ్యల చెరువుల్లో పట్టుబడికి కూడా వెళుతుంటాడు. రోజు మాదిరిగానే పని పూర్తి చేసుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. గురువారం తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో కోరంగి పంచాయతీ సుబ్బారాయుని దిమ్మ సమీపంలోని రొయ్యల కంపెనీ ఎదురుగా చీకట్లో ఉన్న ఆవును బలంగా ఢీకొన్నాడు. ఈ ఘటనలో విజయ్‌ అక్కడికక్కడే మృతి చెందగా, ఆవు కూడా సంఘటనా స్థలంలోనే చనిపోయింది. మృతుడి భార్య దుర్గాదేవి 10 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. వారికి ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. తండ్రి పెమ్మాడి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. భార్యాభర్తలు ఏడాది వ్యవధిలోనే మృతి చెందడంతో చినవలసల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరి చిన్నారుల బాధ్యత వృద్ధాప్యంలో ఉన్న నానమ్మ, తాతయ్యలపై పడింది.

8 సవర్ల

బంగారు గొలుసు చోరీ

కరప: ఇంట్లోకి చొరబడి మహిళ మెడలోని 8 సవర్ల బంగారు గొలుసును దొంగలు లాక్కుని పారిపోయారు. కరప మండలం నడకుదురు గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నడకుదురులోని మెయిన్‌ రోడ్డులో ఉన్న ఓ డాబాలో రావుల సీతమ్మ నివాసం ఉంటున్నారు. తన మేనల్లుడి వివాహం సందర్భంగా గురువారం ఉదయం 10.30 గంటలకు 8 సవర్ల బంగారు గొలుసు ధరించి శుభకార్యానికి వెళ్లేందుకు తయారవుతున్నారు. అప్పటికే ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ఇంటి ముందు నిలబడి ఉన్నారు. వారిలో ఒకడు ఇంట్లోకి ప్రవేశించి, ఆమె ముఖంపై దోమల మందు స్ప్రే చేశాడు. మెడలోని బంగారు గొలుసును లాక్కుని ఇద్దరూ పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై తోట సునీత కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఆక్వా చెరువుల్లోకి

ఓఎన్జీసీ మడ్‌ ఆయిల్‌

ఆక్సిజన్‌ అందక రొయ్యల మృత్యువాత

సఖినేటిపల్లి: అంతర్వేదికర గ్రామ శివారు దారికొడప ప్రాంతంలో ఓఎన్జీసీ చేపట్టిన నూతన వెల్‌ డ్రిల్లింగ్‌ పనుల్లో బయటకు వచ్చిన మడ్‌ ఆయిల్‌ సమీప ఆక్వా చెరువుల్లో చేరి రొయ్యలకు తీవ్ర నష్టం చేకూర్చింది. దీని ప్రభావంతో చెరువుల్లో ఆక్సిజన్‌ అందక గురువారం అధిక సంఖ్యలో రొయ్యలు మృత్యువాత పడ్డాయి. చెరువుల్లో నీరంతా కలుషితమై గంటల వ్యవధిలో రొయ్యలు తేలిపోయాయని రైతులు చెబుతున్నారు. చెరువుల్లో సాగుకు రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టిన తాము.. డ్రిల్లింగ్‌ మడ్‌ ఆయిల్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయామని ఆక్వా రైతు బెల్లంకొండ గంగాధరరావు ఆవేదన వ్యక్తం చేశారు. జల కాలుష్యం వల్ల జరిగిన నష్టాన్ని అటు ఓఎన్జీసీ సంస్థ, ఇటు ప్రభుత్వం అంచనా వేసి తగిన నష్టపరిహారం మంజూరు చేయించాలని కోరారు. ఆయన వెంట ఆక్వా రైతులు నాగేశ్వరరావు, హర్షవర్థన్‌, కేశవరావు, శ్రీనివాస్‌, వాసుదేవరావు, తూము నానాజీ, మేడిచర్ల రామృష్ణ, తిరుమల శ్రీను, మేడిచర్ల పెద్దిరాజు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement