కలెక్టర్ హరేంధిర ప్రసాద్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): నగర పాలక సంస్థ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ ఎన్నికల నిర్వహణపై నగర పాలక సంస్థ అధికారులతో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సన్నద్ధత, సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మేయర్ స్థానానికి నగర పాలక సంస్థ కార్యాలయంలోను, 66 డివిజన్ సభ్యుల స్థానాలకు సంబంధించి 17 ప్రాంతాల్లోను నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సుమారు వెయ్యి మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. పోలింగ్ నిర్వహణకు 1,836 మంది సిబ్బందిని నియమించామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పర్యవేక్షణకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ, అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


