దేవుడు కలిపిన మనుషులు | - | Sakshi
Sakshi News home page

దేవుడు కలిపిన మనుషులు

Nov 12 2026 12:19 AM | Updated on Nov 12 2026 12:19 AM

● అభాగ్య బాలలకు ఆపన్న హస్తం

● సంతానం లేని తల్లిదండ్రులకు వరం

● దత్తత ప్రక్రియతో ఎంతో ప్రయోజనం

ఒకవైపు.. ముళ్లపొదల్లో, చెత్తకుప్పల్లో కొందరు.. రోడ్ల పక్కన అనాథల్లా ఇంకొందరు.. అనారోగ్యంతో, అంగవైకల్యంతో మరికొందరు.. తమ తలరాతో, తల్లిదండ్రులు రాసిన రాతో తెలియదు కానీ, అన్నెంపున్నెం తెలియని ఆ శిశువులు అభాగ్యులుగా మిగిలిపోతున్నారు. తల్లి ప్రేమకు, తల్లిపాలకు కూడా నోచుకోని కన్నీటి గాథలు వారివి. మరోవైపు.. ఏ గుడి మెట్లు ఎక్కినా.. ఏ దేవుడికి మొక్కినా.. ఏ వైద్యుడిని కలిసినా.. ఏ మందులు వాడినా కడుపు పండని దంపతులు. వారి ఆవేదనను దేవుడే ఆలకించాడేమో! దత్తత అనే వరంతో ఆ ఇళ్లల్లో ‘చిరు’కాంతులు నింపాడు. ఏ రుణానుబంధముందో కానీ.. వారిని, వీరిని కలిపాడు. అనాథలుగా మిగిలిన చిన్నారులకు.. వారిని కనని వారిని తల్లిదండ్రుల్ని చేశాడు.

కాకినాడ క్రైం: ఎక్కడో, ఎవరికో పుట్టి అనాథలుగా మిగిలిన చిన్నారులను.. రకరకాల కారణలతో పిల్లలు కలగని దంపతులను కలపడానికే రూపు దిద్దుకున్న అపురూప వరం దత్తత ప్రక్రియ. దీని ద్వారా ఎంతో మంది దంపతులు అభాగ్యులైన పిల్లలను దత్తత తీసుకుని, వారికి సరికొత్త జీవితాన్ని అందిస్తున్నారు. ఈ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన సమగ్ర బాలల పరిరక్షణ పథకంలో భాగంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) ఈ నెలలో దత్తత మాసోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ చెరుకూరి లక్ష్మి పర్యవేక్షణలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి (డీసీపీఓ) చదలవాడ వెంకట్రావు బృందం దత్తతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

నాలుగు రకాలు

● అధికారికంగా చేపట్టే దత్తతలో లీగల్‌ అడాప్షన్‌, రిలేటివ్‌, స్టెప్‌ పేరెంట్‌, పోస్ట్‌కేర్‌ అనే నాలుగు రకాలున్నాయి.

● లీగల్‌ అడాప్షన్‌ అనేది చట్టప్రకారం జరిగే దత్తత ప్రక్రియ. ఇందులో రక్షణ, సంరక్షణ లేని పిల్లల్ని గుర్తించి, అర్హులైన వారికి దత్తత ఇస్తారు.

● రిలేటివ్‌ అడాప్షన్‌ కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య జరిగే అధికారిక దత్తత.

● దంపతులు విడిపోయినప్పుడు, మరో భాగస్వామి సదరు మహిళ జీవితంలోకి వచ్చినప్పుడు, ఆ వ్యక్తికి మహిళ ఇచ్చే దత్తత స్టెప్‌ పేరెంట్‌ అడాప్షన్‌.

● పిల్లల్ని పోషించుకునే స్థోమత లేని తల్లిదండ్రులు లే దా సంరక్షకులు రెండేళ్ల పాటు కోరిన అర్హులకు అధి కారికంగా ఇచ్చే తాత్కాలిక దత్తత పోస్ట్‌కేర్‌ అడాప్షన్‌.

ఎవరిని ఇస్తారంటే..

● చైల్డ్‌ కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో ఉంటూ ఏడాది అంతకంటే ఎక్కువ కాలం పాటు తమ వారి పలకరింపునకు నోచుకోని పిల్లలు.

● 18 ఏళ్లలోపు రక్షణ, సంరక్షణ లేని, తల్లిదండ్రులు వదిలేసిన, దొరికిన, పెంచుకునే స్థోమత లేదంటూ అధికారులకు అప్పగించిన పిల్లలు.

● ఆసుపత్రులు, ఇతర ప్రాంతాల్లో వదిలేసిన వారు.

● అనారోగ్య బాధితులు, అంగవైకల్యం ఉన్న అనాథలు, సంరక్షకులు లేనివారు.

ఎవరికి ఇస్తారు!

● కనీసం మూడేళ్ల కంటే ఎక్కువ దాంపత్య జీవితం ఉండి, పిల్లలు లేని దంపతులకు, ఒక్క సంతానమే ఉన్న వారికి దత్తత ఇస్తారు.

● ఇద్దరు సంతానం ఉన్న వారికి అంగవైకల్యం సహా ప్రత్యేక అవసరాలున్న పిల్లల్నే దత్తత ఇస్తారు.

● ఆర్థిక స్థోమత, పూర్తి స్థాయి ఆరోగ్యవంతులుగా ఉన్నవారికే ఇస్తారు.

● అవివాహితులు, ఒంటరిగా ఉండే సీ్త్రకి బాలుడు లేదా బాలికను ఇస్తారు. పురుషుడుకి కేవలం బాలుడిని మాత్రమే ఇస్తారు.

దరఖాస్తు ఇలా..

● దత్తత తీసుకోవాలనుకునే వారు సీఏఆర్‌ఏ.ఎన్‌ఐసీ.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

● దంపతుల ఫొటో, జనన, వివాహ, నివాస, ఆదాయ, ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలివ్వాలి.

● లీగల్‌ అడాప్షన్‌ దరఖాస్తులో మూడేళ్ల తర్వాత కూడా పిల్లల దత్తతకు అవకాశం రాకపోతే దరఖాస్తు రెన్యువల్‌ చేయించుకోవలసి ఉంటుంది.

● రిలేటివ్‌ అడాప్షన్‌లో పై వివరాలకు అదనంగా వంశవృక్ష వివరాలు కూడా ఇవ్వాలి.

● స్టెప్‌ పేరెంట్‌ అడాప్షన్‌లో అయితే భాగస్వామితో విడాకులు సహా కోర్టు సంబంధిత పత్రాలు లేదా పెద్దల మధ్య విడిపోయి ఉంటే బిడ్డను కన్న తండ్రి అనుమతి తప్పనిసరి.

● దత్తత కోరేవారు కాకినాడ కరణంగారి జంక్షన్‌లో ఉన్న డిస్ట్రిక్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌ అధికారులను, ప్రతాప్‌ నగర్‌లోని రెడ్‌క్రాస్‌ భవంతిలో ఉన్న శిశుగృహను సంప్రదించవచ్చు. వివరాలకు డీసీపీఓను 85550 60818, పీఓ ఎన్‌ఐసీని 63035 99264, శిశుగృహ మేనేజర్‌ను 89191 23488 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలి.

94 మంది బాలల దత్తత

జిల్లాలో గడచిన ఒకటిన్న దశాబ్దాల కాలంలో 94 మంది బాలల్ని అధికారికంగా దత్తత ఇచ్చారు. వీరిలో 10 మంది బాలలు విదేశాలకు వెళ్లారు. 2022లో నలుగురు, 2023లో ముగ్గురు, 2024లో ఆరుగురు, 2025లో నలుగురు, ఈ ఏడాది ఇప్పటి వరకూ నలుగురు పిల్లలు దత్తత ద్వారా కుటుంబ జీవనంలోకి అడుగుపెట్టారు. దత్తత ఇచ్చిన వారి బాగోగుల్ని ఆయా ప్రాంతాల్లోని డీసీపీయూ అధికారులు పరిశీలిస్తారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వారున్న ఇంటిని సందర్శించి బాలలతో మమేకమై, వారు పెరుగుతున్న పరిస్థితులు అడిగి తెలుసుకుంటారు. అక్కడ ఉండటం తమకు ఏమాత్రం ఇష్టం లేదని పిల్లలు చెప్తే తక్షణమే దత్తతను రద్దు చేసి హోమ్‌కు తరలిస్తారు. పిల్లల ప్రవర్తనతో పొసగలేకపోతే దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కూడా రెండేళ్లలోపు ఆ దత్తతను రద్దు చేసుకోవచ్చు.

ప్రతి బిడ్డకూ ఓ కుటుంబాన్నివ్వాలనే..

రక్షణ, సంరక్షణ లేని పిల్లలను దిక్కులేని వారిగా వదిలేయకుండా ప్రతి బిడ్డకూ ఓ కుటుంబాన్ని ఇవ్వాలన్నదే దత్తత సంకల్పం. ఎవరూ లేక దీనావస్థలో ఉన్న పిల్లల సమాచారాన్ని అధికారులకు ఇవ్వాలి. దత్తత తీసుకోవాలనుకునే వారు కూడా ముందుకు రావాలి. తల్లిపాలకై నా నోచుకోని పసిమొగ్గల జీవితాలు దత్తత కారణంగా ఊహించనంత ఉన్నతంగా మారడం ఎంతో సంతృప్తినిస్తోంది.

– చెరుకూరి లక్ష్మి, పీడీ, మహిళా,

శిశు సంక్షేమ శాఖ, కాకినాడ

కాకినాడ బస్టాండ్‌లో దత్తతపై అవగాహన కార్యక్రమం

దత్తత ప్రక్రియను వైద్య ఆరోగ్య సిబ్బందికి వివరిస్తున్న డీసీపీఓ వెంకట్‌

ఏ తల్లి కన్నబిడ్డో, ఆడపిల్ల అనే ఇంకేదైనా కారణమో కానీ.. బొడ్డు పేగు కూడా తీయక ముందే ఆ పసికందును ముళ్ల పొదల్లో మాంసపు ముద్దగా విసిరేశారు. ఓ కుక్క నోట కరిచి పట్టుకుపోతూంటే అక్కడి వారు గమనించి రక్షించారు. రెండేళ్లు గడిచాయి, వీధి కుక్కలకు ఆహారం అయిపోవలసిన ఆ పసిబిడ్డ ప్రస్తుతం కెనడాలో ఓ సంపన్నుల ఇంట మహారాణిలా బతుకుతోంది.

తమ తొందరపాటుతో పుట్టిన ఓ బాలికను వివాహం కాని ఓ జంట అమ్మేశారు. విషయం తెలిసిన అధికారులకు ఆ శిశువును రక్షించారు. ఎన్‌టీఆర్‌ జిల్లా నందిగామకు చెందిన ఓ లెక్చరర్‌ కుటుంబానికి దత్తత ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఇంట చదువుల తల్లిగా ఆ బిడ్డ వర్ధిల్లుతోంది.

తల్లిదండ్రులు చనిపోవడంతో వారి పదేళ్ల బాలికను నగరంలోని ఓ చిల్డ్రన్‌ హోమ్‌లో ఆమె తాతయ్య, అమ్మమ్మ చేర్పించారు. కొన్నాళ్లకు వారూ మరణించారు. తనకెవరూ లేరనుకున్న ఆ బిడ్డను కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన స్టేట్‌ బ్యాంక్‌ రీజినల్‌ మేనేజర్‌ దంపతులు దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం ఆ బాలిక ధనవంతుల బిడ్డగా, సకల సదుపాయాలతో, దేవుడిచ్చిన అమ్మనాన్నలతో సంతోషంగా జీవిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement