నూతన కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

నూతన కార్యవర్గం

Nov 12 2026 12:19 AM | Updated on Nov 12 2026 12:19 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు బుధవారం స్థానిక పీఆర్‌ కళాశాలలో నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లాది జగన్నాథం, జ్యోతుల రాంబాబు, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ ఆసన్‌ రతన్‌ రాజ్‌, రాష్ట్ర స్థాయి స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగుల విభాగం ప్రతినిధి డి.మోహన్‌ కృష్ణ ఆధ్వర్యాన ఈ ఎన్నికలు జరిగాయి. సంఘం జిల్లా అధ్యక్షుడిగా వీరమళ్ల లోవరాజు, కార్యదర్శిగా పులి నాగేంద్రబాబు, కోశాధికారిగా పి.శ్రీనివాస్‌ అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా ఒగ్గు మల్లిబాబు, సభ్యులుగా చింతా అమల్‌, కొమ్మ గణపతి, హసీనా సుల్తానా షేక్‌, షేక్‌ ఆశ, కె.గంగాధర్‌, ఎ.కామేశ్వరరావు, ఏఎస్‌ సమీర్‌ శర్మ, జి.అపర్ణ, కోనాడ మణికంఠ, ఎ.సతీష్‌ కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర సంఘం మార్గదర్శకత్వంలో జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో సంఘాన్ని విస్తరించి, ప్రతి ఉద్యోగికీ అండగా నిలిచేలా కార్యాచరణ రూపొందిస్తామని నూతన కార్యవర్గం ప్రకటించింది.

నేడు, రేపు బాలల సైన్స్‌ కాంగ్రెస్‌

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ శాస్త్ర సాంకేతిక మండలి, పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యాన గురు, శుక్రవారాల్లో కాకినాడ గీతం పాఠశాలలో 32వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం పోస్టర్లను జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈఓ) పిల్లి రమేష్‌ బుధవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చిన్నారుల్లోని ప్రతిభను వెలికి తీసే లక్ష్యంతో జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలను విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. గత ఆగస్టులో నిర్వహించిన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా 218 ప్రాజెక్టులు నమోదు చేశారని, వీటిని నిపుణులతో మూల్యంకనం చేస్తామని చెప్పారు. ఈ ఏడాది సుస్థిరత కోసం విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణలు అనే ప్రధాన ఇతివృత్తంతో ప్రాజెక్టులు రూపొందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో గీతం పాఠశాల డైరెక్టర్‌ సుజ్ఞాన్‌, ప్రిన్సిపాల్‌ సురభి శారద, జిల్లా సైన్స్‌ కాంగ్రెస్‌ కో ఆర్డినేటర్‌ వెంకటరావు, జిల్లా సైన్స్‌ అధికారి కేసరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ సమస్యలు

పరిష్కరించాలి

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లాలో ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్‌కు పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షులు ప్రదీప్‌ కుమార్‌, కార్యదర్శి బండి నూకరాజు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన పదో తరగతి స్పాట్‌ వాల్యుయేషన్‌ టీఏ, డీఏలు వెంటనే జమ చేయాలని, డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు ఓపీఎస్‌ అమలుకు ఉత్తర్వులు జారీ చేయాలని, గ్రూప్‌–1, గ్రూప్‌–2కు దరఖాస్తు చేసుకున్న వారికి నిరభ్యంతర పత్రాలు (ఎన్‌ఓసీ) మంజూరు చేయాలని, ప్రస్తుతం జరుగుతున్న ఎస్‌ఏ మార్కుల ఆన్‌లైన్‌ నమోదుకు గడువు పెంచాలని కోరారు.

సంజీవని, టాటా ప్రాజెక్టులకు

ఏర్పాట్లు చేయాలి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): సంజీవిని, టాటా డిజిటల్‌ ఇంటిగ్రేటెడ్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ కేర్‌ ప్రాజెక్టులను జిల్లాలో విజయవంతంగా అమలు చేసేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లూ గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ అన్నారు. వైద్య ఆరోగ్యం, రెవెన్యూ శాఖల అధికారులు, టాటా సంస్థ ప్రతినిధులతో కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలలు, జనరల్‌ ఆసుపత్రుల వరకూ సమన్వయంతో కూడిన డిజిటల్‌ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. రోగులకు అవసరమైన వైద్య సలహాలు, స్పెషలిస్ట్‌ వైద్యులతో వర్చువల్‌ సంప్రదింపులు, రిఫరల్‌ సేవలు, అపాయింట్‌మెంట్లు, ఎలక్ట్రానిక్‌ రికార్డులను ఒకే వ్యవస్థ ద్వారా అనుసంధానం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement