బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి అక్రమాలకు నిరసనగా కలెక్టరేట్ వద్ద వామపక్షాలు బుధవారం ధర్నా నిర్వహించాయి. రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు ప్రజాస్వామ్య పరిరక్షణ దినం పిలుపులో భాగంగా ఈ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ ప్రాంతాల్లో అధికార కూటమి అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి, నామినేషన్లు వేయకుండా, ఓటింగ్‌కు ప్రజలు రాకుండా అడ్డుకున్నారని, ఇది రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు చేయడం కూడా ప్రభుత్వ పనితనానికి గీటురాయేనా అని ప్రశ్నించారు. ఒకవైపు దేశంలో బీజేపీ కనుసన్నల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లను తొలగిస్తూంటే, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా అధికార యంత్రాంగం తోడ్పడుతోందని దుయ్యబట్టారు. నిరంకుశ పాలకులకు ప్రజలే తగిన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నామినేషన్ పత్రాలను చించివేయడం, పోలింగ్ బూత్‌లను ఆక్రమించడం వంటి పరిస్థితి ఏర్పడటం వెనుక పోలీసు యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, కనీసం త్వరలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలైనా రాజ్యాంగబద్ధంగా, స్వేచ్ఛగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.


