బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని మొత్తం 379 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. తొలి విడతలో 4 మండలాల్లోని 78 గ్రామ పంచాయతీలకు.. రెండో విడతలో కాకినాడ డివిజన్ పరిధిలోని 3 మండలాలు, పెద్దాపురం డివిజన్ 5 మండలాల్లోని 146 గ్రామ పంచాయతీలకు.. మూడో విడతలో పెద్దాపురం డివిజన్ 8 మండలాల్లోని 155 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని వివరించారు. ఈ ఎన్నికల సన్నద్ధతపై జిల్లా స్థాయి అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లు, అధికారుల విధులు, బాధ్యతలు, వివిధ శాఖల మధ్య సమన్వయంపై సమీక్షించి, పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి పొరపాట్లు, ఉల్లంఘనలకు తావు లేకుండా అప్రమత్తంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వహించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రి సిద్ధం చేయడం, బ్యాలెట్ పేపర్ల ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్‌ల గుర్తింపు, పోలింగ్ కేంద్రాల స్థితిగతుల పరిశీలన, రూట్ల రూపకల్పన, సెక్టార్ అధికారుల నియామకం, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, నామినేషన్ స్వీకరణ కేంద్రాల ఏర్పాటు, వాహనాల వంటి ఏర్పాట్లను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలులోకి వచ్చిందని, దీనిని కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నామన్నారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ, 21 వరకూ ఉపసంహరణ ప్రక్రియ జరుగుతాయని కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ ప్రియ, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


