బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): స్వాతంత్య్ర సమరయోధుడిగా, దేశ తొలి విద్యా శాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి, భారత విద్యారంగ అభ్యున్నతికి అందించిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, బాగా చదువుకోవడంతో పాటు సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆజాద్ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో బుధవారం జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించారు. ఆజాద్ చిత్రపటానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, డీఆర్‌ఓ తిప్పేనాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.


