గురుకులంలో ‘ఒక దీపం–ఒక సంకల్పం’ | - | Sakshi
Sakshi News home page

గురుకులంలో ‘ఒక దీపం–ఒక సంకల్పం’

Nov 8 2026 12:43 AM | Updated on Nov 8 2026 12:43 AM

కాకినాడ క్రైం: కాకినాడలోని సాంబమూర్తినగర్‌ గురుకుల పాఠశాలలో శనివారం ఒక దీపం–ఒక సంకల్పం నినాదంలో బాల్య వివాహ ముక్త్‌ భారత్‌ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహ రహిత సమాజాన్ని నిర్మించాలనే సంకల్పంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ పీడీ చెరుకూరి లక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులు ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఈ సందర్భంగా డీసీపీవో చెదలవాడ వెంకట్రావు మాట్లాడుతూ బాలల రక్షణకు ఉద్దేశించిన చట్టాలపై అవగాహన కల్పించి, బాల్యం ప్రాధాన్యతను వివరించారు. బాల్య వివాహ రహిత జిల్లాగా కాకినాడను తీర్చిదిద్దాలని, తమ ఉన్నత భవిత కోసం అదే ప్రతి బాలిక సంకల్పం కావాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహానికి ఒక బాలిక బలైపోతే ఓ తరం నాశనం అయినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. బాలల హక్కులు తెలుసుకుని, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098 సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్య, రక్షణ, ఉజ్వల భవిత ప్రాధాన్యతలను వివరించారు. అనంతరం దీపాలు వెలిగించి, భవిత నిర్మాణంలో ఎదురయ్యే చీకట్లను చెరిపేసే వెలుగురేఖగా ప్రతి విద్యార్థి తీర్చిదిద్దబడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి జె.విజయ, క్రాఫ్‌ స్వచ్ఛంద సంస్థ సమన్వయకర్త బి.కుమారి, డీసీపీయూ కౌన్సిలర్‌ బి.దుర్గారాణి, సోషల్‌ వర్కర్‌ ఎస్‌.చినబాబు సహా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకు ముందు ఈ బృందం దత్తత మాసోత్సవంలో భాగంగా కాకినాడ బస్టాండ్‌లో ప్రయాణికులకు చట్టబద్ధ దత్తత అంశంపై అవగాహన కల్పించారు. పిల్లలను అక్రమ దత్తత ఇచ్చినా, పొందినా ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలను వివరించారు. పోస్టర్‌ ప్రదర్శనతో అవగాహన కల్పించారు.

హుండీల ఆదాయం రూ.14.56 లక్షలు

బోట్‌క్లబ్‌(కాకినాడసిటీ): స్థానిక సూర్యారావుపేటలోని బాలా త్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో హుండీల ఆదాయాన్ని శనివారం లెక్కించారు. దసరా మహోత్సవం సందర్భంగా ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు రావడంతో అమ్మవారి హుండీ ఆదాయం రూ.14.56 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈవో ఉండవల్లి వీర్రాజు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో దేవదాయశాఖ ఈవోలు కేవీ వేణుగోపాల్‌, ఎం.వీరభద్రరావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement