ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వారి గోవింద నామస్మరణతో తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా గౌతమీ గోదావరిలో స్నానాలు ఆచరించి, క్యూలో నిలబడి స్వామిని దర్శించారు. చాలామంది కాలినడకన ఆలయానికి వచ్చారు. ఆలయంలో వేకువ జామునే సుప్రభాత సేవ, తొలి హారతి, నీరాజనాలను ఆలయ అర్చకులు, వేద పండితులు ఘనంగా నిర్వహించారు. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. దర్శనం అనంతరం వకుళామాత అన్నదాన భవనంలో భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. ఆలయ ఈవో, దేవదాయశాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, సిబ్బంది, అర్చకులు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.


