అన్నవరం: సత్యదేవుని జన్మనక్షత్రం మఖ సందర్భంగా బుధవారం రత్నగిరిపై సత్యదీక్షలు ప్రారంభమయ్యాయి. సత్యదేవుని ఆలయం వద్ద, కొండ దిగువన నేరేళ్లమ్మ, వినాయకుని ఆలయాల వద్ద సుమారు 200 మంది భక్తులు ఈ దీక్ష చేపట్టారు. తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా వీరిలో ఉండడం విశేషం. అలాగే జగ్గంపేట నియోజకవర్గంలో, అడ్డతీగలలో మరో 400 మంది గిరిజనులు దీక్ష చేపట్టినట్టు దేవస్థానం అధికారులు తెలిపారు. వీరంతా 27 రోజుల పాటు దీక్ష కొనసాగించి డిసెంబర్ ఒకటో తేదీన సత్యదేవుని జన్మనక్షత్రం మఖ నాడు స్వామివారి సన్నిధిలో విరమిస్తారన్నారు. 18 రోజుల దీక్ష చేపట్టే భక్తులు ఈ నెల 13 నుంచి, తొమ్మిది రోజుల దీక్ష చేపట్టే భక్తులు ఈ నెల 22 నుంచి మాలధారణ చేయాలని, అందరూ డిసెంబర్ ఒకటిన దీక్ష విరమించాలన్నారు.
స్వామివారికి పూజలు
సత్యదీక్షలు ప్రారంభమైన సందర్భంగా స్వామివారి వార్షిక కల్యాణ మండపం వద్ద సత్య పీఠం ఏర్పాటు చేసి సత్యదేవుడు, అమ్మవారికి పండితులు ప్రత్యేక పూజలు చేశారు. సత్యదీక్ష విరమణ జరిగే వరకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఇక్కడ స్వామి, అమ్మవారికి పూజలు చేయనున్నారు. ఇంటి వద్ద పీఠం పెట్టే అవకాశం లేని స్వాములు ఇక్కడ జరిగే పూజల్లో పాల్గొనవచ్చని దేవస్తానం తెలిపారు.


