● టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
● మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా డిమాండ్
ఏలేశ్వరం: ఎన్నికల వేళ రాష్ట్రంలోని అధికార కూటమి కుయుక్తులకు పాల్పడిందని వైఎస్సార్ సీపీ ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలేశ్వరం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. స్థానికంగా మున్సిపల్ ఫలితాల్లో జరిగిన అక్రమాలపై బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కన్నబాబు మాట్లాడుతూ, టీడీపీ ఓడిపోతుందనే భయంతోనే ఆర్‌డీఓ, జాయింట్ కలెక్టర్ అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. దాడిశెట్టి రాజా మా ట్లాడుతూ, ప్రజల మద్దతుతో గెలవలేక ఎన్నికల వేళ చంద్రబాబు అక్రమాలకు తెర తీశారని అన్నారు. పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో తేడా వచ్చిన 11 ఓట్లకు వివరణ ఇస్తానని చెప్పిన ఆర్‌డీఓ జాడ ఇప్పటి వరకూ లేదన్నారు. కౌంటింగ్ వద్దకు ఆర్‌డీఓ, జేసీ, డీఎస్పీతో పాటు భారీ సంఖ్యలో పోలీసులు రావాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ప్రజల ఓటు హక్కును ప్రభుత్వం కాజేసిందన్నారు. చంద్రబాబు పెంచి పోషిస్తున్న ఈ పాములు రేప్పొద్దున ఆయననే కాటేస్తాయని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, బదిరెడ్డి ఆశాలత, బదిరెడ్డి గోవిందు, సామంతుల సూర్యకుమార్, సుంకర రాంబాబు పాల్గొన్నారు.


