లో
వరుణతాండవం
కరపలో అత్యధిక వర్షపాతం
కరప మండలంలో అత్యధికంగా 148.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పలు మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. మండలాల వారీగా వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో):
కరప 148.8, కాజులూరు 146.4, పెదపూడి 142.4, కాకినాడ అర్బన్ 96.2,
తాళ్లరేవు 76.6, కాకినాడ రూరల్ 63.4, పిఠాపురం 48.8, యు.కొత్తపల్లి 44.4, పెద్దాపురం 36.8, గొల్లప్రోలు 34.6,
సామర్లకోట 33.2, తుని 22.4, తొండంగి 19.6, కిర్లంపూడి 18.2, రౌతులపూడి 16.8, జగ్గంపేట 15.2, శంఖవరం 14.6, ప్రత్తిపాడు 14.4, ఏలేశ్వరం 12.8, గండేపల్లి 12.4, కోటనందూరు 5.2.
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): మురసు తుపాను తోడుగా వరుణుడు మరోసారి విరుచుకుపడ్డాడు. జిల్లావ్యాప్తంగా బుధవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకూ కుండపోత దంచి కొట్టింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రహదారులపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్లన్నీ సెలయేళ్లను తలపించాయి. జిల్లా కేంద్రమైన కాకినాడలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్నడూ లేనివిధంగా జీజీహెచ్‌లోని వార్డులు జలమయమయ్యాయి. దీంతో, రోగులు, వారి బంధువులతో పాటు వైద్యులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు నగరంలోని ప్రధాన రహదారులతో పాటు అనేక రోడ్లపై ఎక్కడ చూసినా భారీ మొత్తంలో నీరు నిలిచిపోయింది. ఏది రోడ్డో, ఏది గొయ్యో గుర్తించలేక వాహనచోదకులు, పాదచారులు తీవ్ర అగచాట్లు పడ్డారు. సినిమా రోడ్డు, రెవెన్యూ కాలనీ, ఆర్టీసీ కాంప్లెక్స్, ఎల్‌బీ నగర్ తదితర ప్రధాన ప్రాంతాల్లోని రోడ్లపై గంటల తరబడి వర్షపు నీరు ప్రవహించింది.
కుదేలైన అన్నదాత
ఇప్పటికే అర్నబ్ తుపాను దెబ్బకు కుదేలైన రైతులకు మురసు తుపానుతో కురుస్తున్న భారీ వర్షాలు మరింత నష్టాన్ని తెచ్చిపెట్టాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పంట భూములు నీట మునిగాయి. పొలాల్లో నిలిచిన నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోగా తాజాగా కురిసన భారీ వర్షానికి వరి చేలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. చేతికి అందివచ్చిన పంటలు నీట మునుగుతూండటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పంట కోతకు సిద్ధమవుతున్న తరుణంలో వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. పొలాల్లో నీరు నిలిచిపోవడంతో పంటలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని, దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని వాపోతున్నారు.
8
‘మురసు’ తోడుగా దంచి కొట్టిన వాన
జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు
స్తంభించిన జనజీవనం
జలమయమైన కాకినాడ జీజీహెచ్
నీట మునిగిన పంటలు, లోతట్టు ప్రాంతాలు


