పదండి..పరిషత్‌ పోలింగ్‌కు | - | Sakshi
Sakshi News home page

పదండి..పరిషత్‌ పోలింగ్‌కు

Nov 5 2026 12:16 AM | Updated on Nov 5 2026 12:16 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లాలో పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే పోలింగ్‌ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకుని, ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి వరకూ ప్రయత్నాలు కొనసాగించారు. మరోవైపు ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా పోలీసులు, ఎన్నికల అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

వర్షంతో పోలింగ్‌ సిబ్బందికి ఇబ్బందులు

పోలింగ్‌ సామగ్రి పంపిణీని జిల్లా అధికారులు బుధవారం చేపట్టారు. సరిగ్గా అదే సమయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ఆయా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకునేందుకు సిబ్బంది నానా అవస్థలూ పడ్డారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడతాయనే ప్రచారం కూడా జరిగింది. అయితే, ఎన్నికలు యథాతథంగానే నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేయడంతో తమకు కేటాయించిన సామగ్రితో సిబ్బంది ఆయా పోలింగ్‌ కేంద్రాలకు బయలుదేరారు. కాకినాడ రూరల్‌ మండలం ఏపీఎస్పీ మూడో బెటాలియన్‌ జెడ్పీ హైస్కూల్‌, పిఠాపురం బాదం మాధవరావు బాలికల ఉన్నత పాఠశాల, గండేపల్లి ఎంపీడీవో కార్యాలయం, పెద్దాపురం మహారాణి కళాశాల, కరప జెడ్పీ హైస్కూల్‌లో ఎన్నికల సామగ్రి పంపిణీని జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌ పరిశీలించారు. పోలింగ్‌ అధికారులకు అవసరమైన బ్యాలెట్‌ బాక్సులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల బ్యాలెట్‌ పత్రాలు, వేలికి వేసే సిరా, స్టాంపులు, సీల్‌ చేసే మైనం, కవర్లు, నివేదిక పత్రాలు అందించామని చెప్పారు.

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నాలు

పరిషత్‌ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో పలువురు కూటమి నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చివరి వరకూ విస్తృత ప్రయత్నాలు చేశారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉండటంతో అభ్యర్థుల గెలుపోటముల్లో వారి ఓట్లు కీలకంగా మారనున్నాయి. దీంతో, వారిని ఆకట్టుకునేందుకు కొన్ని గ్రామాల్లో కూటమి అభ్యర్థులు డబ్బులు, చీరలు పంపిణీ చేశారు. సామర్లకోట మండలం నవర గ్రామంలో ఇంటింటికీ తిరిగి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పురుష ఓటర్లకు మద్యం, బిర్యానీ అందించారు. పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో ఓటుకు రూ.2 వేల చొప్పున పంపిణీ చేశారంటే ప్రలోభాలు ఏ స్థాయిలో సాగాయో అర్థం చేసుకోవచ్చు. కొన్ని గ్రామాల్లో ఓటుకు రూ.వెయ్యి కూడా పంపిణీ చేశారు.

జిల్లాలో ‘పరిషత్‌’ ఎన్నికల వివరాలు

జెడ్పీటీసీలు

మొత్తం స్థానాలు 20

అభ్యర్థులు 80

వైఎస్పార్‌ సీపీ 20

కాంగ్రెస్‌ 14

టీడీపీ 11

స్వతంత్రులు 9

జనసేన 7

బీజేపీ 2

ఇతరులు 17

ఎంపీటీసీలు

మొత్తం స్థానాలు 401

ఏకగ్రీవం 6

ఎన్నికలు జరుగుతున్నవి 395

పోటీ చేస్తున్న అభ్యర్థులు 933

వైఎస్సార్‌ సీపీ 395

టీడీపీ 253

జనసేన 140

స్వతంత్రులు 114

బీజేపీ 11

కాంగ్రెస్‌ 6

ఇతరులు 14

పోలింగ్‌ కేంద్రాలు

మొత్తం పోలింగ్‌ కేంద్రాలు 1,317

అత్యంత సున్నితమైనవి 670

సున్నితమైనవి 406

ఓటర్లు

పురుషులు 5,80,945

మహిళలు 5,87,856

ఇతరులు 47

మొత్తం 11,68,848

20 జెడ్పీటీసీ, 395 ఎంపీటీసీ స్థానాలకు నేడు ఎన్నికలు

ఉదయం 7 నుంచి

సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహణ

జిల్లా వ్యాప్తంగా

1,317 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement