అన్నవరంలో కార్తిక ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

అన్నవరంలో కార్తిక ఏర్పాట్లు

Nov 5 2026 12:10 AM | Updated on Nov 5 2026 12:10 AM

● భక్తులకు ఇబ్బంది లేకుండా వసతులు

● ఈవో సూర్యచక్రధరరావు

అన్నవరం: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్టు అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల పది నుంచి డిసెంబర్‌ ఎనిమిదో తేదీ వరకు కొనసాగనున్న కార్తిక మాసంలో రత్నగిరికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. వారి కోసం చేసిన ఏర్పాట్లను ఆయన వివరించారు.

● కార్తిక మాసంలో శని, ఆది, సోమవారాలతో బాటు, దశమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తిక పౌర్ణమి తదితర 17 పర్వదినాల్లో స్వామివారి సన్నిధికి భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున తెల్లవారుజామున ఒంటి గంట నుంచే స్వామివారి వ్రతాలు, రెండు గంటల నుంచి స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వ్రతాలు, దర్శనం టిక్కెట్లు, ప్రసాదాల విక్రయాలకు అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కార్తిక మాసంలో పంపా నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు కావున ముందు జాగ్రత్తగా ఇద్దరు గజఈతగాళ్లను ఏర్పాటు చేయనున్నారు.

● నవంబర్‌ 21వ తేదీ సాయంత్రం 5.30 గంటల నుంచి పంపా నదిలో జరిగే తెప్పోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది మాదిరిగానే 20 మంది గజఈతగాళ్లు, తెప్పకు ఎస్కార్ట్‌గా రెండు బోట్లు నడపాలని నిర్ణయించారు.

● కార్తిక పౌర్ణిమ సందర్బంగా నవంబర్‌ 24న సత్యదేవుని గిరి ప్రదక్షణ ఉదయం ఎనిమిది గంటలకు పల్లకీతో, మధ్యాహ్నం రెండు గంటలకు సత్యరథంతో ప్రారంభమై సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది. అదే రోజు ఆరు గంటలకు పంపా నది వద్ద హారతులు, రాత్రి ఏడు గంటలకు తొలిపాంచా వద్ద జ్వాలాతోరణం నిర్వహిస్తారు. గిరిప్రదక్షణ రోడ్డుకు ఇరు వైపులా విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

● కార్తిక మాసంలో చిన్నకార్లు, ఆటోలు మినహ మరే ఇతర పెద్ద వాహనాలను కొండమీదకు అనుమతించరు. పెద్ద వాహనాలను కళాశాల మైదానంలో నిలిపి వేసి, భక్తులు దేవస్థానం బస్సుల్లో కొండ మీదకు తరలించాలని నిర్ణయించారు.

● రత్నగిరి, సత్యగిరిపై సుమారు వెయ్యి కార్లు, మూడు వేల బైకులను నిలిపేందుకు పార్కింగ్‌ స్థలాలు సిద్ధం చేశారు. రత్నగిరిపై రెండు వేల మంది సేద తీరేందుకు వీలుగా రత్నగిరి డార్మెట్రీ, విష్ణుసదన్‌లోని 36 హాళ్లు, సీఆర్వో కార్యాలయం వద్ద ఒక డార్మెట్రీ అందుబాటులో ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement