ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రంలో జరుగుతున్న శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత ఆలయంలో అర్చకులు స్వామి, అమ్మవార్లను తొళక్క వాహనంపై ఉంచి విశేష పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట భజనలు, వేద మంత్రోచ్చారణల నడుమ కల్యాణ మూర్తులను రథం వద్దకు తీసుకొచ్చారు. రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేసి విశేష పుష్పాలతో అలంకరించి హారతులిచ్చారు. అనంతరం ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, ఈఓ వేండ్ర త్రినాథరావు రథం వద్ద పూజలు చేసి, బలిహరణ సమర్పించారు. ఆపై రథోత్సవం ప్రారంభమైంది. ఆలయ ముఖ మండపంలో స్వామివారు పాండురంగడు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు..
ఫ ఉదయం 10.30 గంటలకు చక్రస్నానం.
ఫ రాత్రి 9 గంటలకు ధ్వజావరోహణ.
అనంతరం అశ్వ వాహనంపై గ్రామోత్సవం.
ఫ ప్రత్యేక అలంకారం: నవనీత కృష్ణ


