చింతూరు: నిత్యం మద్యం తాగి వచ్చి భర్త సాగిస్తున్న వేధింపులను భరించలేక భార్య తిరగబడింది. ఈ క్రమంలో ఆమె కర్రతో కొట్టిన దెబ్బలకు భర్త మృతి చెందాడు. చింతూరు మండలం దబ్బగూడెంలో సోమవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్న జల్లి భద్రమ్మకు భర్త లక్ష్మణరావు (38)తో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. లక్ష్మణరావు నిత్యం మద్యం తాగి వచ్చి ఆమెను తీవ్రంగా కొట్టేవాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం కూడా తాగి వచ్చి భద్రమ్మతో పాటు కుమారుడు చరణ్‌ను కర్రతో తీవ్రంగా కొట్టాడు. కుమారుడిని కొట్టడాన్ని భరించలేక పోయిన భద్రమ్మ తిరగబడింది. అతడికి బుద్ది చెప్పాలనే ఉద్దేశంతో కర్రతో దాడి చేసింది. దీంతో లక్ష్మణరావు కోపంగా బయటకు వెళ్లి, పక్కనే వున్న ఇంటివద్ద పడిపోయాడు. వెంటనే అతడిని కుమారుడి సాయంతో ఇంటికి తీసుకువచ్చింది. తిరిగి తమకు కొడతాడనే భయంతో అతడి చేతులు కట్టేసింది. లక్ష్మణరావు ఆ రాత్రి అన్నం తినకుండా మంచినీరు తాగి ఆరు బయటే నిద్రపోయాడు. సోమవారం తెల్లవారుజామున భద్రమ్మ లేచి పరిశీలించడగా మృతి చెంది ఉన్నాడు. ఘటనా స్థలాన్ని చింతూరు సీఐ గోపాలకృష్ణ, ఎస్సై నాసిర్ హుస్సేన్ పరిశీలించి, వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫ భర్త మృతి
ఫ దబ్బగూడెంలో ఘటన


